MBS Jewelers MD Sukesh Gupta attends ED enquiry today: మినరల్స్, మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్‌ను మోసం చేశారనే కేసులో ఈడీ అధికారులు ఎంబీఎస్ జువెల్లర్స్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు. సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు పీఎమ్మెల్యే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2005 నుంచి 2011 వరకు ఎంబీఎస్ జువెల్లర్స్, దాని అనుబంధ సంస్థలు కలిసి ఎంఎంటీసీ నుంచి భారీగా బంగారాన్ని అరువుగా తీసుకున్నారు.
ED Enquiry On MBS Jewelers MD Sukesh Gupta : బంగారు వ్యాపారులకు రాయితీపై ఎంఎంటీసీ అరువుగా బంగారాన్ని ఇస్తుంది. ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకొని ఎంబీఎస్ జువెల్లర్స్, దాని అనుబంధ సంస్థలు భారీగా బంగారాన్ని అరువుగా తీసుకున్నాయి. సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీనా గుప్త, వందన గుప్తా డైరెక్టర్లుగా ఎంబీఎస్ జువెల్లర్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలను నిర్వహిస్తున్నారు. ఎంబీఎస్ జువెల్లర్స్‌కు కిలోల కొద్దీ బంగారు వజ్రాభరణాలను ఎంఎంటీసీ విక్రయించింది.
దాదాపు రూ.500 కోట్లు విలువ చేసే బంగారు వజ్రా భరణాలను ఎంబీఎస్ కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో ఎంఎంటీసీకి నష్టం వాటిల్లింది. రూ.200 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ఎంఎంటీసీ అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీసీకి చెందిన కొంత మంది అధికారుల అండతో ఎంబీఎస్ జువెల్లర్స్ అధినేత సుఖేశ్ గుప్తాకు మోసానికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
ED officials to question Sukesh Gupta: సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారం విక్రయించగా వచ్చిన లాభాలను ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెట్టినట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. 2021 ఏప్రిల్‌లో ఎంబీఎస్ జువెల్లర్స్‌కు చెందిన రూ.323 కోట్లను జప్తు చేశారు. ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ సుఖేశ్ గుప్తా వేసిన పిటీషన్‌ను 2019లో హైకోర్టు కొట్టేసింది.
Money laundering case against MBS Jewelers: 2022 అక్టోబర్‌లో ఈడీ అధికారులు ఎర్రమంజిల్‌లోని ముసద్దీలాల్ జేమ్స్ అండ్ జువెలర్స్‌తో పాటు సికింద్రాబాద్, విజయవాడలోని ముసద్దీలాల్ జువెల్లర్స్‌లలో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.100 కోట్లు విలువ చేసే బంగారు, వజ్రా భరణాలతోపాటు ఎంబీఎస్ జువెల్లర్స్ డెరైక్టర్లైన సుఖేశ్ గుప్తా, అనురాగ్ గుప్తా బినామీలకు చెందిన రూ.50 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు. మూడు షోరూంలలో సీజ్ చేసిన బంగారు, వజ్రా భరణాలను కోఠిలోని ఎస్బీఐ ట్రెజరీకి తరలించారు. బ్యాంకు లావాదేవీలు, బంగారు క్రయవిక్రయాలకు సంబంధించిన కీలక పత్రాలను బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు.
మరోసారి హైకోర్టును ఆశ్రయించిన సుఖేశ్ గుప్తా: ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ సుఖేశ్ గుప్తా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఈడీ దర్యాప్తుపై స్టే విధించింది. హైకోర్టు స్టే విధించడం వల్ల దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతోందని ఈడీ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎంఎంటీసీ నుంచి తీసుకున్న బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులు ఎక్కడికి తరలించారనేది తెలుసుకోవాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాది అన్నారు. సుఖేశ్ గుప్తాకు చెందిన స్థిరాస్తి సంస్థలు, ఇతర సంస్థల వివరాలను తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు. దీంతో కోర్టు సుఖేశ్ గుప్తాను విచారించడానికి అనుమతించింది. ఎంబీఎస్ జువెల్లర్స్ వ్యాపారాలతోపాటు కంపెనీ డైరెక్టర్లైన అనురాగ్ గుప్తా, నీనా గుప్తా వివరాలను ఈడీ అధికారులు సుఖేశ్ గుప్తా నుంచి సేకరించనున్నారు. ఇతర డైరెక్టర్లు, బినామీల పేరుతో ఏమైనా వ్యాపారాలు నిర్వహిస్తున్నారా అనే కోణంలో ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు.
ఇవీ చదవండి: