హైదరాబాద్లో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలన్నింటినీ సంబంధిత కార్పొరేటర్లకు అందజేసి... సత్వర పురోగతిలో వారిని భాగస్వామ్యం చేయాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎల్.బి.నగర్, సరూర్ నగర్, హయత్ నగర్ సర్కిళ్లలో జరగుతున్న నాలా విస్తరణ, వరద ముంపు నివారణ పనుల పురోగతిపై డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితర అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గతేడాది కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్బీ నగర్ నియోజక వర్గంలో ఎక్కువ నష్టం వాటిల్లిందని... ఈసారి అలా జరగకుండా ఉండేందుకు పలు నాలాల అభివృద్ధి, బాక్స్ డ్రైయిన్లు, చెరువులకు తూములు, నాలాల పూడిక పనులు చేపట్టడం తదితర ముందస్తు చర్యలను చేపట్టామని మేయర్ తెలిపారు.
వర్షాలు కురిసే అవకాశమున్నందున కొత్తగా డ్రైనేజీ పనులను, తవ్వకాలను నిషేధించామని వెల్లడించారు. ఎల్బీనగర్ జోన్లో స్వయంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు రోజూ తమ పరిధిలోని పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తే అధికారులు అప్రమత్తంగా ఉంటారని మేయర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్ జోనల్ పరిధిలోని నాలాల పూడిక పనులు 95 శాతం పూర్తయ్యాయని కమిషనర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. నగరంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. టీకా పంపిణీ పూర్తికాగానే వెంటనే కార్పొరేటర్లు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: SURVEY: పురుషుల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్