భార్యభర్తల మధ్య జరిగిన గొడవల కారణంగా వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనిత విహార్ కాలనీలో నివాసముంటున్న బెన్నీ ఆండ్రూ అనే వ్యక్తితో మూడు నెలల క్రితం ప్రియాంక అనే యువతికి ఆర్య సమాజ్‌లో వివాహం జరిగింది.
ఈ కొద్ది రోజుల్లోనే ఆండ్రూ అసలు స్వరూపం బయటపడింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న విషయం ప్రియాంకకు తెలిసింది. ఈ విషయంపై నిలదీసిన ఆమెను... ఆండ్రూ మానసికంగా శారీరకంగా హింసించాడని మృతురాలి తల్లి ఆరోపించారు.
తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక గురువారం ఉదయం 9 గంటల సమయంలో... పడక గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుంది. గమనించిన ఇరుగుపొరుగువాళ్లు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ప్రియాంక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియాంక భర్త ఆండ్రూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.