కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్య శాఖలతోపాటు రెవెన్యూ, మున్సిపల్, పౌరసరఫరాల, వ్యవసాయ శాఖల ఉద్యోగుల సేవలను టీపీసీసీ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి ప్రశంసించారు.
కొవిడ్- 19పై ప్రత్యేకంగా ఏర్పాటైన టీపీసీసీ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులతో... మర్రి శశిధర్ రెడ్డి మొదటిసారి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణకు సర్కారు తీసుకుంటున్న చర్యలను వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాల నుంచి సలహాలు స్వీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రతి రోజు హెల్త్ బులెటిన్లను విడుదల చేయడం లేదన్నారు. భారత ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలతో పోలిస్తే వ్యత్యాసాలు ఉంటున్నాయని మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. కేరళలో మాదిరి ప్రతి రోజు తప్పకుండా సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి, ఇతర అధికారులు కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేయాలని సూచించారు.