maoist hidma is alive : భద్రాచలం సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన కాల్పులపై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరు మీద విడుదలైన లేఖలో కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా చనిపోలేదని స్పష్టం చేశారు. హిడ్మా చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్న మావోయిస్టులు.. హిడ్మా సురక్షితంగా ఉన్నాడని తెలిపారు. దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలోని కొండలపై పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు వైమానిక దాడులు చేశారని.. గతేడాది ఏప్రిల్‌లోనూ బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
maoist hidma death rumours : మావోయిస్టు పార్టీ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని దెబ్బ తీయాలని వందల సంఖ్యలో బాంబులు పేల్చారని తెలిపిన మావోయిస్టులు.. రాత్రీ, పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టినట్లు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోపు మావోయిస్టులను ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన మేరకు దాడులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పంట పొలాలకు వెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే దేశంలోని పాలకవర్గాలకు వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని ప్రగతిశీల, ప్రజాస్వామ్య కూటములు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
అసలు ఏం జరిగిందంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో బుధవారం సీఆర్‌పీఎఫ్ దళాలు కూబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురు పడటంతో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి కమాండర్‌గా ఉన్న హిడ్మా సహా పలువురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందింది. దీనిపై పోలీసులు కానీ, మావోయిస్టు పార్టీ కానీ నిన్న అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎన్‌కౌంటర్ వార్తలపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. భద్రతాదళాల సభ్యులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు. సవివరమైన సమాచారం త్వరలో తెలియజేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే నేడు మావోయిస్టులు కీలక లేఖ విడుదల చేశారు.
అసలు ఎవరీ హిడ్మా..? పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)కి హిడ్మా కమాండర్‌గా ఉన్నారు. ఈ దళంలోని సభ్యులు అత్యాధునిక ఆటోమేటిక్ ఆయుధాలను వినియోగిస్తారు. దళాలపై దాడులు చేశాక.. అపహరించిన అత్యాధునిక ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను ఈ బెటాలియన్ ఎక్కువగా వాడుతుంటుంది. వీరు పూర్తిగా యూనిఫామ్‌లో ఉంటారని పేరు. హిడ్మా నేతృత్వంలో జరిగే దాడుల్లో భద్రతా దళాలకు జరిగే నష్టంతో పోలిస్తే మావోల వైపు 10 శాతం కంటే తక్కువ ప్రాణ నష్టం ఉంటుందనే పేరుంది. అందుకే గతంలో సుక్మా సమీపంలో జరిగిన దాడుల్లో భద్రతా దళాలు భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూశాయి. అందుకే అతడు అత్యంత వేగంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా స్థానం దక్కించుకొన్నాడు. సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వారు అత్యధికంగా ఉంటారు. కానీ, సుక్మా నుంచి ఈ స్థానంలోకి వెళ్లిన తొలి వ్యక్తి హిడ్మా.
ఇవీ చూడండి..