రాష్ట్రంలో వ్యవసాయ పంటల సాగు శరవేగంగా సాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పనులు ఊపందుకోవడంతో... కర్షకలోకం వ్యవసాయ పనుల్లో నిమగ్నమైంది. ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1 కోటి 34 లక్షల 77 వేల 15 ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా... బుధవారం వరకు 72 లక్షల 78 వేల 494 ఎకరాల్లో పూర్తైనట్లు వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన వారాంతం నివేదికలో వెల్లడించింది. ఈ సంవత్సరం నుంచి నియంత్రిత పంట సాగు విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో... వరి, పత్తి, కంది పంటలే సింహభాగం ఆక్రమించాయి. ప్రధాన ఆహార పంట వరి తీసుకుంటే... 27 లక్షల 25 వేల 58 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయాలన్న నిర్థేశిత లక్ష్యం మేరకు 24 శాతం మేర నాట్లు వేశారు.
ఇంకా జారీ కాని పంట బీమా పథకం
ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే సాధారణ సాగు విస్తీర్ణం 44 లక్షల 50 వేల 29 ఎకరాలకుగాను ఇప్పటి వరకు 50 లక్షల 41 వేల 269 ఎకరాల్లో పూర్తయింది. అంటే 113 శాతం వరకు ఎగబాకింది. కంది సాధారణ సాగు విస్తీర్ణం 7 లక్షల 61 వేల 212 ఎకరాలకుగాను ఇవాళ్టి వరకు 98 శాతం ముగిసింది. మరో పంట సోయాబీన్ తీసుకుంటే... 4 లక్షల 88 వేల 753 ఎకరాల్లో సాగైంది. ఇప్పటి వరకు 79 శాతం మేర పూర్తైంది. ప్రకృతి విపత్తుల బారి నుంచి రక్షణ కవచంలా ఉండాల్సిన పంట బీమా పథకం నోటిఫికేషన్ జారీ కాలేదు. ఈ సంవత్సరం అసలు ఈ పథకమే రాష్ట్రంలో అమల్లో లేదు. ఒకవైపు పత్తి విస్తీర్ణం పెరిగింది. గత సంవత్సరాల నోటిఫికేషన్ల ప్రకారం పత్తి తీసుకుంటే జులై 15 నాటికి ప్రీమియం చెల్లింపు గడువు ముగుస్తుంది. కానీ, ఈ ఏడాది ఇక ఈ పథకం అమలు చేయనట్లుగానే భావించాలి. చివరి నిమిషంలోనైనా సర్కారు స్పందించి పత్తి రైతులకు తానే ప్రీమియం చెల్లించి పథకం అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతుల విశ్వాసం పొందని పీఎంఎఫ్‌బీవై
గత 30 ఏళ్లుగా పంటల బీమా పథకాలు ఇంకా పైలట్ దశలోనే మిగిలిపోతున్నాయంటే ప్రభుత్వాలకు గ్రామీణ రైతాంగం పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరే కారణం. జాతీయ వ్యవసాయ బీమా పథకం - ఎన్‌ఏఐఎస్ కొంతకాలం అమలైనా... అందులో ఉన్న నిబంధనల వల్ల ఎక్కువ మంది రైతులు బీమా పరిధిలోకి రాలేకపోయారు. మొత్తం రైతుల్లో బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్య ఎప్పుడూ 10 శాతం దాటలేదు. పరిహారం పరంగా ఈ పథకం రైతులను పెద్దగా ఆదుకోలేదు. అనేక లోపాలతో నడిచిన ఈ పథకం రైతుల విశ్వాసాన్ని పొందలేకపోయింది. ఈ నేపథ్యంలో 2016లో నరేంద్రమోదీ సర్కారు దేశవ్యాప్తంగా “ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన - పీఎంఎఫ్‌బీవై పేరిట కొత్త పంటల బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంలోనే వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం - డబ్ల్యూబీసీఐఎస్ ఒక ప్రత్యేక భాగంగా ఉంది. ఈ రెండు పథకాలకూ మార్గదర్శకాలు రూపొందించిన కేంద్రం ఆడంబరంగా ప్రచారం చేసుకున్నప్పటికీ అంతిమంగా రైతుల విశ్వాసం పొందలేకపోయింది.
ప్రచారాలు ఘనం.. అవగాహన శూన్యం..
పీఎంఎఫ్‌బీవైలో భాగంగానే కొన్ని పంటలకు ప్రత్యేకంగా వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలవుతుంది. ఈ పథకం కింద రాష్ట్రంలో పత్తి, టమాటా, ఆయిల్‌ఫాం, మిరప వంటి 4 పంటలు ఉన్నాయి. పత్తి పంట విస్తీర్ణం అధికం. ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువే. 2016 నుంచి గత సంవత్సరం ఖరీఫ్ వరకూ... రబీలో ఏకైక పంటగా మామిడి ఈ పథకం కిందకు వస్తుంది. కానీ, ఏ సంధర్భంలో బీమా పరిహారం వస్తుంది అన్నది చాలా మంది రైతులకు తెలియదు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తెలుగులో కరపత్రాలు, గోడపత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలి. బీమా కంపెనీలు కూడా ప్రచారంచేయాల్సి ఉన్నప్పటికీ ఈ బాధ్యత తీసుకోలేదు. నోటిఫికేషన్ ఆంగ్లంలో ఉంటుంది. అది కేవలం వెబ్‌సైట్ జీవోల్లో మాత్రమే దొరుకుతుంది. బ్యాంకులు తాము ఇచ్చిన పంట రుణాల నుంచి ప్రీమియం మినహాయించుకోవడం తప్ప ఈ పథకం గురించి లోతుగా రైతులకు చెప్పరు. బీమా పథకం మార్గదర్శకాల గురించి ఏఈఓలకు శిక్షణ ఉండదు. ప్రీమియం కట్టిన రైతులకు ఆ సీజన్‌లో పరిహారం వచ్చిందో లేదో స్పష్టంగా తెలియదు. ఒక వేళ పరిహారం వచ్చినా బ్యాంకులు ఆ సమాచారం ఇవ్వవు.
రాష్ట్రంలో వ్యవసాయ పంటల ప్రణాళికలు సరే… పంటల బీమా మాటేమిటి...? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో పంట కోత పరీక్షల ఫలితాలు ప్రజల ముందు పారదర్శకంగా లేవు. పైగా జిల్లాల, మండలాల విభజన తర్వాత పంట కోత పరీక్షల వివరాలు గందరగోళంగా తయారైన నేపథ్యంలో... ఆ పథకం అమలు, లబ్ధిదారులు, ఇతర వివరాలు సైతం వ్యవసాయ శాఖ కూడా అవి సమాచార హక్కు చట్టం - ఆర్టీఐ కింద కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమకు న్యాయమెలా జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం