Many changes in telangana Congress Senior Leaders: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పెద్ద రచ్చనే రాజేసింది. రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకిస్తూ... బహిరంగంగా విమర్శలు చేయడంతోపాటు, రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు ఎక్కుపెట్టి లేఖలు సైతం రాశారు. ఆయనకు పీసీసీ ఇవ్వొద్దని ఖరాఖండిగా చెప్పారు. కానీ అధిష్ఠానం వీరందరి అభ్యంతరాలను పక్కన పెట్టి... పీసీసీ అధ్యక్ష పీఠాన్ని రేవంత్ రెడ్డికి(TPCC revanth reddy) కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా సీనియర్లు కొందరు అంటీముట్టనట్లు వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' సభలకు, నిరుద్యోగ, విద్యార్థి సమస్యలపై నిర్వహించిన 'జంగ్ సైరన్' సభలకు సైతం సీనియర్లు కొందరు డుమ్మా కొట్టారు. ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన పార్టీ హైకమాండ్... పార్టీ సీనియర్లను కొందరిని దిల్లీకి పిలిపించుకొని సుదీర్ఘంగా చర్చించింది. నేతలందరితో ఉమ్మడిగా మాట్లాడడంతో పాటు విడివిడిగా కూడా నాయకుల అభిప్రాయాలను సేకరించింది.
దిల్లీ నేతల హెచ్చరికలు!
telangana congress party: అధిష్ఠానం గీత దాటి బహిరంగంగా మీడియాతో మాట్లాడే నాయకులను... పార్టీలో అంతర్గతంగా సమస్యలను సృష్టించే నాయకులకు దిల్లీ పెద్దలు గట్టి వార్నింగ్ ఇచ్చారని సమాచారం. నాయకులు విబేధాలన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పని చేయకపోతే చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. దిల్లీ నేతల సందేశాలతో రాష్ట్రానికి వచ్చిన సీనియర్లలో క్రమంగా మార్పులు కనిపిస్తున్నాయి.
సీనియర్లలో భారీ మార్పులు
tpcc president revanth reddy: రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లలో... పార్టీ అధిష్ఠానం మీటింగ్ తర్వాత భారీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డితో కలిసి పని చేసేందుకు ఒక్కొక్కరూ ముందుకు వస్తున్నారు. ఇటీవల పార్టీ నిర్వహించిన 'రైతు నిరసన దీక్ష'లో సైతం ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పాటు సీనియర్లు అంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ ప్రకటించిన 'కల్లాల్లోకి కాంగ్రెస్' కార్యక్రమాలకు కూడా క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ప్రదేశాలకు సీనియర్లు అంతా వెళ్లి పని చేస్తున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఇప్పటికైనా తామంతా కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని... లేదంటే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతురావు(V. Hanumantha Rao) హెచ్చరికలు చేశారు.
శుభ పరిణామం..
telangana congress news: ఇంతకాలం... పార్టీతో అంటీముట్టనట్లుగా ఉన్న సీనియర్లు క్రమంగా మారుతున్నారు. సీనియర్ల ధోరణిలో మార్పు రావడం మంచి శుభ పరిణామమని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో సీనియర్లు అంతా కలిసికట్టుగా ఉంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అంతా మనోధైర్యంతో పని చేస్తారన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి దిల్లీ నేతలు ఇచ్చిన సూచనలు రాష్ట్ర నేతలను ఐక్యతావైపు నడిపిస్తున్నాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇదీ చదవండి: Congress Counter Attack: కాంగ్రెస్ కౌంటర్ రాజకీయం.. తెరాస, భాజపాలపై విమర్శల అటాక్