తెలంగాణ పీసీసీకి నూతన అధ్యక్షుడిని నియమించే ప్రక్రియకు ఏఐసీసీ శ్రీకారం చుట్టింది. ఎంపిక కోసం బుధవారం నుంచి నాలుగు రోజులపాటు నేతల అభిప్రాయాలను సేకరించనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జీ మాణికం రాగూర్ నేడు హైదరాబాద్కు రానున్నారు. ముందుగా పీసీసీ కోర్ కమిటీ అభిప్రాయాన్ని తీసుకుంటారు. గురువారం నుంచి మూడు రోజులపాటు పార్టీకి చెందిన వివిధ విభాగాల నేతలు, శ్రేణులతో మాణికం రాగూర్ సమావేశమవుతారు.
ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యకులు, అనుబంధ సంఘాల బాధ్యులు, పీసీసీ కార్యవర్గం సహా నేతల అభిప్రాయాలను తీసుకుంటారు. శనివారం రాత్రి దిల్లీకి వెళ్తారు. రాష్ట్ర పార్టీ నాయకుల అభిప్రాయాలను ఏఐసీసీకి నివేదిస్తారు. 2023లో శాసనసభ ఎన్నికల్లో పార్టీకి విజయం చేకూర్చే కీలక బాధ్యత పీసీసీపై ఉన్నందున... జాప్యం లేకుండా కొత్త అధ్యక్షుడిని నియమించాలని, సామాజిక సమీకరణలను పరిగణనలోని తీసుకోవాలని పార్టీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఈ నెలాఖరులోపు కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తి చేయడమే ఏఐసీసీ లక్ష్యంగా ఉన్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.
ఇదీ చూడండి : పట్టభద్రుల స్థానాలపై భాజపా దృష్టి.. జోరు కొనసాగించేలా వ్యూహాలు