Mango Markets: మామిడి మార్కెట్లు వెలవెలబోతున్నాయి. మార్చి చివరికల్లా మార్కెట్లకు రావాల్సిన ఈ ఫలరాజం ఇప్పుడు ఏప్రిల్ రెండో వారం వచ్చినా పెద్దగా కనిపించడం లేదు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ సీజన్‌లో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్టు తెలంగాణ రాష్ట్ర కొండాలక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలిందని ఉపకులపతి నీరజ తెలిపారు. చలికాలంలో భారీవర్షాలు కురవడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడం ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం, మార్చిలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత రికార్డుస్థాయిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం మామిడి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
జనవరి నుంచి ఫిబ్రవరి దాకా పగలు 29 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మామిడి పూత నిలబడి పిందెలు అధికంగా ఏర్పడతాయి. కానీ పగటి ఉష్ణోగ్రత 35 నుంచి 38 డిగ్రీల వరకూ నమోదవడం వల్ల పూత ఎండి రాలింది. వాతావరణ మార్పుల వల్ల బూడిద తెగులు, తేనేమంచు పురుగు అధికంగా సోకి తోటలను దెబ్బతీశాయి. ఆ సమయంలో కొందరు రైతులు సస్యరక్షణ చర్యలపై పెద్దగా శ్రద్ధ చూపకపోవడం కూడా దిగుబడి తగ్గడానికి మరో కారణమని శాస్త్రవేత్తల అంచనా.
5 లక్షల టన్నుల దాకా తగ్గనున్న దిగుబడి: సాధారణంగా 13 లక్షల టన్నులకు పైగా దిగుబడి రావాలి. వాతావరణ మార్పుల వల్ల దిగుబడి 5 లక్షల టన్నుల వరకూ తగ్గనుంది. పాతతోటలను తొలగించి ఎక్కువ మొక్కలు నాటే హైడెన్సీటీ విధానంలో దిగుబడి పెరుగుతోంది. వికారాబాద్, సిద్దిపేట, వరంగల్ తదితర జిల్లాల్లో కొందరు ఆసక్తిగల రైతులు ఈ విధానంలో మామిడి సాగుచేయడంతో వారి తోటల్లో పూత, కాత బాగుంది. పాత సంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 60 మొక్కలు నాటితే హైడెన్సిటీలో 250 నుంచి 300 మొక్కలు నాటాలి. సిద్దిపేట జిల్లా ములుగులో ఉద్యానశాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్షేత్రంలో ఈ విధానంలో సాగుచేసిన మామిడితోటలకు పూత, కాత కొంత మెరుగ్గా ఉంది. మహారాష్ట్ర, ఏపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు, అధికారులు వచ్చి ఈ కేంద్రాన్ని పరిశీలించారు.
- వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ
ఇదీ చదవండి: విశ్వనగరంలో విషజలాలు.. పట్టించుకోని అధికారులు.. ఆస్పత్రులపాలవుతోన్న జనాలు..