హైదరాబాద్‌లోని రద్దీ ప్రాంతాలు, బస్సుల్లో జేబు , గొలుసు దొంగతనాలు, చరవాణి చోరీలు జరిగాయంటే పోలీసుల కన్ను ఆ బస్తీవైపే మళ్లుతుంది. హైదరాబాద్ హబీబ్‌నగర్ ఠాణా పరిధిలోని మాంగర్ బస్తీవాసుల నేపథ్యం ఇది. 8 దశాబ్దాల క్రితం బతుకు దెరువు కోసం మహారాష్ట్ర నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లే మాంగర్ జాతివాసులు. దొంగతనాలు చేయడం వీరి ప్రవృత్తి. ఐదారేళ్ల క్రితం వరకు ఇతరులు బస్తీలోకి అడుగు పెట్టాలంటేనే జంకేవారు. పోలీసులను కూడా ముప్పతిప్పలు పెట్టేవాళ్లు. అయితే గతంలో హబీబ్‌నగర్ సీఐగా పనిచేసి వెళ్లిన మధుకర్ స్వామి... మాంగర్ బస్తీ వాసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్వయం ఉపాధి శిక్షణ ఇప్పించి బతుకు మార్గం చూపించారు. అయితే నేరప్రవృత్తితో ఉన్న కొంతమందికి పని దొరక్క, పూటగడవడమే కష్టంగా జీవనం సాగిస్తున్నారు.
ఓటు బ్యాంకుగానే చూస్తున్న నాయకులు
రాజకీయ నాయకులు మాంగర్ వాసులను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం ప్రభుత్వం వీరికి ఇళ్లు కట్టించి ఇచ్చింది. ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. 27న రాత్రి ఇంట్లో గోడ కూలిన ఘటనలో ముక్కుపచ్చలారని ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి. హబీబ్‌నగర్ నాలాకు దిగువనే మాంగర్ బస్తీ ఉండటంతో.. చిన్నపాటి వర్షానికే బస్తీ నీటిమయమవుతోంది. ఇంటి పెళ్లలు పడటం, పైకప్పు పెచ్చులు ఊడిపడి చిన్న చిన్న ప్రమాదాలు జరగడం బస్తీవాసులకు నిత్యకృత్యంగా మారింది.
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని...
శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశించినా.... ఎక్కడికీ వెళ్లలేక అందులోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. బయటికి వెళ్లినా తమకు ఎవరూ ఇళ్లు అద్దెకివ్వరని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీరికి సౌకర్యాల కల్పనకోసం తీవ్రంగా కృషిచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికైనా పరిష్కారం చూపించండి
ఎన్నికల సమయంలో తప్ప తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మాంగర్ బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పక్కా ఇళ్లు కట్టించి, సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: నేడే డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎన్నికలు