Mandous Cyclone in Andhra and Rayalaseema: ఏపీలోని తిరుపతి జిల్లాలో మాండౌస్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వెంకటగిరిలో చెవిరెడ్డి చెరువుకు భారీగా నీరు చేరింది. మల్లమ్మ గుడి వీధిలో నివాసాలు నీటమునిగాయి. బొగ్గులమిట్టలో మగ్గం గుంటల్లోకి నీరు చేరింది. ఎన్టీఆర్ కాలనీ, బీసీ కాలనీ, సాలి కాలనీలో చేనేత పనులు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలకు స్వర్ణముఖి నది పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
కాజ్‌వేలపై నీరు పొంగి ఏర్పేడు - సదాశివపురం ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తొట్టంబేడు మండలం కొత్త కండ్రికలో ఇళ్లల్లోకి వరద చేరింది. లింగం నాయుడుపల్లి- శ్రీకాళహస్తి రహదారిపై వరదతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. రౌతు సూరమాలలో చెరువు కట్టకు గండి కొట్టి నీటిని దిగువకు వదిలారు.
సత్యవేడు నియోజకవర్గం వరదాయపాలెంలో శ్రీకాళహస్తి - తడ మార్గంలో సున్నపు కాల్వపై ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోగా...ప్రయాణికులను స్థానికులు కాపాడారు. నారాయణవనం మండలంలో అరుణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరువట్యం, పాలమంగలం ఉత్తరం, తుంబురు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాలాయపల్లి మండలం వెంకటరెడ్డి పల్లి దగ్గర నేరేడువాగు వంతెనపై నుంచి వరద పారుతోంది. వెంకటగిరి - గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచాయి. కాళంగి జలాశయం నుంచి దిగువకు వరద వదిలారు.
పుడిసికేపురం - ఎంఏ రాజులకండ్రిగ మధ్య కాజ్ వే కొట్టుకుపోయింది. కడగుంట మినీ వంతెన, నిండలి కాజ్ వే పై కైవల్య నది ప్రవహిస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో కైవల్య నది పరవళ్లకు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. దక్కిలి మండలం దగ్గవోలు మార్గంలో లింగసముద్రం వద్ద చెట్లు రోడ్డు మీద పడింది. అధికారులు తొలగించారు. నాయుడుపేట, సూళ్లూరుపేటలో తుపాను ప్రభావంతో వరి నారుమళ్లు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.
అన్నమయ్య జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గంలో కోడూరు, ఓబులవారిపల్లి, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. బొప్పాయి, అరటి, మామిడి తోటలకు నష్టం జరిగింది. బాలుపల్లి చెక్ పోస్ట్ ప్రధాన రహదారిపై శేషాచలం అడవుల నుంచి వచ్చే నీరు.. జలపాతంలా కనిపిస్తూ కనువిందు చేస్తోంది.
కడప జిల్లా: ఎడతెరిపి వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ ప్లాట్ ఫారాలపైకి నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అరవిందనగర్, మృత్యుంజయకుంట, భాగ్యనగర్ కాలనీ, భరత్ నగర్, నకాశ్ వీధి, గంజికుంట కాలనీలను వర్షపు నీరు ముంచెత్తింది. ప్రైవేటు కళాశాలలకు సెలవులు ప్రకటించారు. అన్ని సబ్ డివిజన్ల పరిధిలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
నెల్లూరు జిల్లా: కనకమహల్ సెంటర్, కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడలి , పొదలకూరు రోడ్డు , పద్మావతి సెంటర్, డైకాస్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరి జనం ఇబ్బందిపడ్డారు. సంగం, కలువాయి, ఏఎస్ పేట, అనంతసాగరంలో మోస్తరు వర్షం కురిసింది. పెన్నాకు భారీ వరదతో నీటిని దిగువకు వదిలారు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. చేజర్ల మండలంలో వాగులు పొంగాయి. తూర్పు కంభంపాడు, మడపల్లి వద్ద మధ్యలో నల్లవాగు ఉద్ధృతికి 10 గ్రామాలకు రాకపొకలు నిలిచాయి. గొల్లపల్లి, ఓబులాయపల్లి మధ్యలో పందల వాగు ఉద్ధృతితో అధికారులు ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. జిల్లాలో చాలా చోట్ల వరి నాట్లు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా: చేతికి వచ్చిన పంట వర్షాలకు నీటిపాలైందని కృష్ణా జిల్లా రైతులు వాపోతున్నారు. కల్లాల్లో వడ్లు మెలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ధాన్యం తడిసింది. బండిపాలెం, చిల్లకల్లు గండ్రాయిలో వడ్లు ఆరబెట్టు కొనేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పెనుగంచిప్రోలు మండలం అనగండ్లపాడు, గుమ్మడిదూరు, కొనకంచిలో మిర్చిని కాపాడుకునేందుకు పట్టాలు కప్పుతున్నారు.
ప్రకాశం జిల్లా: పామూరు, ఒంగోలులో భారీగా వర్షం కురిసింది. సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంకు సమీపంలో సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు చిక్కుకుపోయారు. రెవెన్యూ, మెరైన్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇవీ చదవండి: