ఇంటర్మీడియట్ బోర్డులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సదస్సులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ రాములు నాయక్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను అందలం ఎక్కిస్తూ మైనార్టీ ఉద్యోగులను తొక్కేస్తున్నారని మందకృష్ణ మాదిగ, జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఇంటర్మీడియట్ బోర్డు అన్యాయాలకు, అక్రమాలకు నిలయంగా మారిందని విమర్శించారు. విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు పొందిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని.. వారిని తొలగించి నూతన నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్లపై ఈ నెలాఖరులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. అనంతరం అఖిలపక్ష సమావేశం నిర్వహించి... ఇందిరాపార్కు వద్ద 24 గంటల నిరాహారదీక్ష చేస్తామని తెలిపారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకుంటే... ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.
ఇదీ చూడండి : నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంతో 'అగ్రిటెక్'