డిగ్రీలో యాజమాన్య కోటా కోసం కొన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడి ఫలించింది. ప్రైవేట్ కాలేజీల్లో 30 శాతం డిగ్రీ సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యా మండలి అంగీకరించింది. యాజమాన్య కోటా అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సర్కారు ఆమోద ముద్ర వేస్తే... రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని డిగ్రీ సీట్లన్నీ ఇంటర్మీడియట్లో ప్రతిభ ఆధారంగా దోస్త్ ద్వారా ఆన్లైన్లో భర్తీ చేస్తున్నారు.
కొన్ని కళాలశాలల ఒత్తిడి వల్లే..
రాష్ట్రంలో 966 ప్రైవేట్, మైనారిటీ కాలేజీల్లో 3 లక్షల 55 వేల 945 డిగ్రీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 845 కాలేజీల్లోని 3 లక్షల 13 వేల 485 సీట్లను దోస్త్ ద్వారా ఆన్లైన్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, లా, ఇతర వృత్తి విద్య కోర్సుల్లో ఉన్న యాజమాన్య కోటా విధానం తమకూ అమలు చేయాలని కొంతకాలంగా కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఉన్నత విద్యా మండలి మొదట్లో నిరాకరించినప్పటికీ... చివరకు తలూపింది. ప్రైవేట్ కాలేజీల్లోని లక్ష 6వేల 783 సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకునేందుకు ఉన్నత విద్యామండలి పచ్చజెండా ఊపింది.
తమకు వద్దంటూ గ్రామీణ కళాశాలల..
ప్రస్తుతం ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల్లో యాజమాన్య కోటా సీట్లను కాలేజీలు బహిరంగంగానే అమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ సీట్లలోనూ యాజమాన్య కోటాకు ఉన్నత విద్యా మండలి మొగ్గు చూపడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఉన్నత విద్యా మండలి నిర్ణయాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉన్నత విద్య మండలి సిఫార్సులు.. పేద, మధ్యతరగతి మెరిట్ విద్యార్థులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ ఫీజు చెల్లించే వారికే యాజమాన్య కోటా సీట్లను కాలేజీలు కేటాయించే అవకాశాలున్నాయి.
సీట్ల భర్తీ కష్టసాధ్యం..
కేవలం పట్టణ ప్రాంతాల్లోని కొన్ని కాలేజీల యాజమాన్యాల కోసమే ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సీట్లు భర్తీ కావడం లేదని.. ఇప్పుడు 30శాతం తామే భర్తీ చేసుకోవాలంటే... అది తమకు నష్టమేనని గ్రామీణ ప్రాంత ప్రైవేటు డిగ్రీ కళాశాలలు చెబుతున్నాయి.
ఈ విధంగా కకాలేజీ యాజమాన్యాల మధ్యే భిన్నాభిప్రాయాలు తలెత్తడం వల్ల... యాజమాన్య కోటా.. ఐచ్ఛికంగా ఉండాలని ఉన్నత విద్యా మండలి సర్కారుకు సిఫార్సు చేసింది. యాజమాన్య కోటా వద్దనుకుంటే.. ఆ కాలేజీలోని సీట్లన్నీ దోస్త్ ద్వారానే భర్తీ చేస్తామని చెబుతోంది. ఉన్నత విద్యా మండలి సిఫార్సులపై రాష్ట్ర విద్యాశాఖ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.