మానవత్వంతో ఓ చిన్నారిని చేరదీస్తే... మతం అడ్డంకిగా మారింది. సమాజంలో తోటివారి నుంచి చీదరింపులు, దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను పెంచుకున్న కూతురు కోసం ఆత్మహత్యకు యత్నించాడు. గోకుల్‌చాట్ బండార్‌లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మూడేళ్ల బాలిక తల్లిదండ్రులను కోల్పోయింది. చుడీబజార్‌కు చెందిన పాపాలాల్ 2007లో బాలిక సానియా ఫాతిమాను అక్కున చేర్చుకొని సొంత కూతురిలా పెంచుకున్నాడు.
13 సంవత్సరాలుగా ప్రేమగా చూసుకున్నాడు. ఆ పాపతోపాటు తనకు ముగ్గురు పిల్లలున్నారు. ఓ మతానికి చెందిన అమ్మాయిని పెంచుకోవడం పట్ల స్థానికులతో తరుచు గొడవలు జరిగేవి. ఈ విషయంపై స్థానిక షాహినాత్ గంజ్ పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేశాడు. పెయింటర్‌గా పని చేస్తూ... ఆడపిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు. స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు తరుచూ గొడవపడుతూ... తనపైనే అక్రమ కేసులు పెట్టగా.. పాపాలాల్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
ఇరువర్గాల గొడవల కారణంగా పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఆదివారం పోలీసులు పాపాలాల్‌ను విచారించేందుకు అతని ఇంటికి చేరుకోగా... మనస్తాపానికి గురై ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న పాపాలాల్‌ను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపాలాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత