Hyderabad man goes missing in Goa: హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో గోవా వెళ్లిన టెంపో డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంపై ఆందోళన నెలకొంది. గత నెల 19న 10 మందితో శ్రీనివాస్ గోవా వెళ్లాడు. మరుసటి రోజు ప్రయాణికులను అక్కడ దింపి అరగంటలో వస్తానని చెప్పి సాయంత్రం బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి వరకు ఫోన్‌లో టచ్ లో ఉన్నా తర్వాత స్విచ్ఛాప్ రావటంతో ప్రయాణికులు వెతికారు. ఫలితం లేకపోవటంతో టెంపో యజమానికి సమాచారం ఇచ్చారు. వారిని తీసుకువచ్చిన అతడు.. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపాడు. కుటుంబీకులు గోవా వెళ్లి శ్రీనివాస్ కోసం గాలించారు. కనిపించకపోవటంతో అంజున ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఇలా ఆందోళన చెందుతుండగానే సోమవారం సాయంత్రం ఇంటికి చేరిన శ్రీనివాస్‌ను చూసి షాక్‌కు గురయ్యారు. తల, పొట్టభాగంలో కుట్లు చూసి ఆందోళన చెందారు. మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారని అనుమానించారు. ఏం జరిగిందని అడిగినా శ్రీనివాస్ పూర్తిస్తాయిలో స్పష్టంగా చెప్పడం లేదు.
శ్రీనివాస్ పరిస్థితి మరింత దయనీయం.. గోవాలోని పోలీసుస్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీనీ తీసుకువచ్చిన కుటుంబసభ్యులు.. హైదరాబాద్ ఎస్.ఆర్ నగర్ పోలీసులను సాయం చేయాలని కోరారు. గోవాలో కేసు కాబట్టి ఇక్కడేమీ చేయలేమని పోలీసులు చెప్పినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తేనే కుటుంబం గడుస్తుందని ఈ పరిస్థితిలో ఏం పాలుపోవడం లేదని కుటుంబీకులు చెబుతున్నారు. కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించలేని స్థితిలో వారి ఆర్థిక పరిస్థితి ఉండటంతో శ్రీనివాస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తమను ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
అసలేం జరిగింది.. ఈటీవీలో ప్రసారమైన కథనాన్ని చూసి స్పందించిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్ధీన్.. శ్రీనివాస్‌ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్చించారు. శ్రీనివాస్‌కు వివిధ పరీక్షలు చేసిన వైద్యులు.. శరీరంలోని అవయవాలు అన్ని ఉన్నాయని ప్రకటించారు. తలకు గాయం అవడంతో అతనికి శస్త్ర చికిత్స జరిగినట్లు వెల్లడించారు. ఇంట్రాకార్నికల్ ప్రిజర్వేషన్ పద్ధతి ద్వారా చికిత్స జరిగి ఉంటుందని భావిస్తున్నారు. శస్త్ర చికిత్స చేయడం కారణంగానే శ్రీనివాస్ బతికి ఉన్నాడని వైద్యులు భావిస్తున్నారు. అసలేం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారని బాబా ఫసియుద్ధిన్ తెలిపారు. గత నెల 20న అదృశ్యమైన శ్రీనివాస్ హైదరాబాద్ ఎలా చేరుకున్నాడో మిస్టరీగా మారింది.
ఇదీ చూడండి: