Majlis complaint to Speaker against Rajasingh గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్‌ను శాసనసభ నుంచి బహిష్కరించాలని శాసనసభాపతిని మజ్లిస్ కోరింది. ఈ మేరకు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ లేఖ రాశారు. పదే పదే తన చర్యలతో.. రాజాసింగ్ శాసనసభ్యునిగా అర్హత కోల్పోతున్నారని సభ వెలుపల, లోపల ఆయన వైఖరి కారణంగా అసెంబ్లీ గౌరవానికి భంగం కలుగుతోందని పేర్కొన్నారు.

రాజాసింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు శాసనసభ్యునిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘిస్తున్నాయని రాజ్యాంగ మౌలికసూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యేగా రాజాసింగ్ అనర్హుడనేందుకు ఆయన వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఫిర్యాదులు, పత్రికా కథనాలను లేఖతో జతపర్చడంతో పాటు రాజాసింగ్ తన ప్రవర్తనతో ఇటీవలి అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ అయినట్లు గుర్తుచేశారు.
తన ప్రవర్తన వల్ల ఎమ్మెల్యేగా అర్హత కోల్పోవడంతో పాటు ప్రమాణ స్వీకారానికి విరుద్ధంగా ఉన్నందున రాజ్యాంగంలోని 194వ ఆర్టికల్ ప్రకారం సభా గౌరవ ఉల్లంఘన ధిక్కారం కింద రాజాసింగ్‌పై చర్యలు తీసుకునే అధికారం శాసనసభకు ఉందని సభ నుంచి బహిష్కరించే అధికారాలు ఉన్నాయని లేఖలో మజ్లిస్ పేర్కొంది. వాటన్నింటిని పరిగణలోకి తీసుకొని రాజాసింగ్‌పై బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించాలని శాసనసభాపతిని మజ్లిస్ విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి: