Real Estate Fraud in Hyderabad: మధ్య తరగతి వ్యక్తులకు వారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంలో వారి సంపాదన అంతా దానికే పెడతారు. తక్కువ ధరకు వచ్చే వెంచర్లు చూసి కొనుక్కోవాలని అనుకొంటారు. దీన్ని రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఆసరాగా తీసుకొని ఎక్కువగా మోసాలు చేస్తున్నారు. వెంచర్లు వేసి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ ప్రజలను మోసం చేసిన ఘటన మియాపూర్‌లో చోటు చేసుకుంది. మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ రాయల్ లీఫ్, రాయల్ ప్యారడైజ్, రాయల్ మింట్ పేరుతో మూడు వెంచర్లు వేసి 300 మంది దగ్గర సుమారు రూ.50 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. మైత్రి ప్రాజెక్ట్ ఎండీ జానీ బాషా షేక్ గత మూడు సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్ చేస్తామంటూ మభ్యపెడుతూ కాలం గడుపుతున్నాడని బాధితులు తెలిపారు.
నిందితుడిని అరెస్ట్ చేయాలి: ఒక్కసారిగా అందరూ అడిగేసరికి రాత్రికి రాత్రి ఫ్యామిలీతో పారిపోయాడని, ఇందుకోసం మూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పుటి వరకు ఎలాంటి స్పందన లేదని వాపోతున్నారు. మోసపోయిన వారిలో దాదాపుగా అందరూ మధ్య తరగతి, పేదవారే ఉన్నారని చెప్పారు. దయచేసి తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీసులను కోరారు. మియాపూర్‌లోని మైత్రి ప్రాజెక్ట్స్ ఆఫీస్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేశారు. వెంటనే నిందితుడు జానీ బాషా షేక్‌ను అరెస్ట్ చేయాలని బాధితులు కోరారు.
"నేను జానీ బాషా షేక్ దగ్గర ప్లాట్ తీసుకున్నాను. గత మూడు సంవత్సరాలుగా త్వరలోనే రిజిస్ట్రేషన్ చేస్తాను అంటూ కాలాన్ని ముందుకు నెడుతూ వచ్చాడు. మేము చాలా సార్లు అడిగాం. దాని నుంచి తప్పించుకోడానికి అతను మాకు చెక్‌లు ఇచ్చాడు. అవి బ్యాంక్‌కి వెళ్లి మార్చుతుంటే బౌన్స్ అయిపోయాయి. ఇలా రెండు సార్లు జరిగింది. ఇలానే చాలా మందిని మోసం చేశాడని కొన్ని రోజులకు నాకు అర్ధమయింది. మేమంతా కార్యాలయానికి వచ్చి చూసేసరికి లాక్ వేసి ఉంది. కంపెనీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇది కూడా వారి పథకం అయ్యే ఉంటుంది. ఇది మా అందరికి ఇప్పుడే అర్థమయింది. మేము చాలా మంది మోస పోయాం. మాకు తగిన న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నాం."- బాధితుడు
ఇవీ చదవండి: