Mahila Suraksha Sambaralu : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ సురక్ష దివాస్ పేరుతో పోలీసులు సమాజంలో శాంతి భద్రతలపై చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద మహిళా సురక్ష సంబరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కవిత, మేయర్ విజయలక్ష్మి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, సినీ నటుడు నాని,టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Telangana Decade Celebrations : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో పోలీసుల సేవలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. దేశంలోనే షీ టీమ్స్ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. దేశంలోనే రాష్ట్ర పోలీస్ శాఖ ఆదర్శంగా నిలుస్తోందని.. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సత్యవతి రాఠోడ్ ఆకాక్షించారు.
Kavitha in Suraksha Diwas Celebrations : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పుడు అనేక అపోహలు ఉండేవని పేర్కొన్నారు. భద్రత ఉండదు, రౌడీల రాజ్యంగా మారుతుందని దుష్ప్రచారం జరిగిందని చెప్పారు. కానీ ఆ అపోహలను పటాపంచలు చేస్తూ కర్ఫ్యూ లేకుండా రికార్డు పాలన చేసిన ఘనత.. రాష్ట్ర పోలీసులకే దక్కుతుందని వివరించారు. గత 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదని, ఒక్క మతకల్లోలం ఘటన జరగలేదని కవిత వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయని కవిత వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి కూడా ఆడపిల్లలు ధైర్యంగా రోడ్లపై నడిచి వెళ్లే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో డయల్ 100కు ఫోన్ చేస్తే ఏడు నిమిషాల్లో పోలీసులు వస్తారని.. గ్రామీణ ప్రాంతాల్లో 14 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దేశంలోనే షీ టీమ్స్.. ఆదర్శంగా నిలిచాయని కవిత స్పష్టం చేశారు.
"దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసులకు శుభాకాంక్షలు. రాష్ట్రప్రభుత్వం ఆడబిడ్డలకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలో షీ టీమ్స్.. ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్రానికి వరదలా పెట్టుబడులు వస్తున్నాయి." -కవిత, ఎమ్మెల్సీ
హైదరాబాద్‌లో మహిళలకు ప్రభుత్వం భద్రత కల్పించిందని సినీ నటుడు నాని పేర్కొన్నారు. పోలీసులు మహిళల భద్రతకు చేపడుతున్న చర్యలు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు. తాను షూటింగ్ కోసం ఎక్కడికి వెళ్లినా తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చెబుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని సినీనటుడు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ పోలీసులు ప్రదర్శించిన విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ట్యాంక్‌బండ్ మధ్యలో జరిపిన బాణాసంచా పేలుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇవీ చదవండి: