MadhuYashki comments on Revanth: అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని.. పోరాటమంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఉండాలని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. ఎవరు సీఎంగా ఉంటే అధికారులు వారిమాట వింటారని... అవినీతికి పాల్పడే అధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఒక్కటేనని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిలో మాట్లాడిన ఆయన... అధికారులపై విమర్శలు చేస్తే ప్రజలదృష్టి మరలుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రామాల్లో తిరగాలి
బిహార్ సైతం దేశంలో భాగమేనని ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయవచ్చని మధుయాష్కీ స్పష్టం చేశారు. మన ఊరు- మన పోరు నినాదంతో బహిరంగ సభలు పెట్టడం వల్ల ఉపయోగంలేదన్నారు. గ్రామ స్థాయిలో రచ్చబండపై కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాదిరిగా గ్రామ గ్రామాన తిరగాలని సూచించారు.
రేవంత్ ఏమన్నారంటే..
కాగా ఇటీవల డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుల్లో ఉండటంపై రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఆయనను బలవంతంగా సెలవుపై పంపించిందంటూ వ్యాఖ్యానించారు. మహేందర్ రెడ్డికి ఆత్మగౌరవం ఉంటే.. డీజీపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. బిహార్ ఐఏఎస్లకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని రేవంత్ ఇటీవల మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ ఐఏఎస్లకు ఎన్ని శాఖలు ఇచ్చారని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ.. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులను పావుగా వాడుకోవడం తగదని డీజీపీ హితవు పలికారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదన్నారు.
ఇదీ చదవండి: డిసెంబర్లో అసెంబ్లీ రద్దు.. మార్చిలో ఎన్నికలు.. కార్యకర్తల సభలో రేవంత్