ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్న అరాచక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 9న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభకు రాజకీయాలకు అతీతంగా అందరూ తరలి రావాలని కోరారు. ప్రజల స్పందన చూస్తుంటే సభకు లక్షకు పైగా జనం వచ్చేలా ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం రోజు నాడే.. కాంగ్రెస్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధు అంటూ సీఎం కేసీఆర్ మళ్లీ మోసాలకు తెరలేపారని మధుయాష్కీ దుయ్యబట్టారు. దళిత, గిరిజనుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చినా తక్కువేనని వ్యాఖ్యానించారు.
దళిత, గిరిజన సోదరుల హక్కుల కోసం ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా నిర్వహిస్తున్నాం. ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని ప్రతి తెలంగాణ బిడ్డను ఆహ్వానిస్తున్నాం. స్వయం పరిపాలన, ఆత్మ గౌరవంతో కూడిన పరిపాలన కోసం ఈ తెలంగాణను సాధించుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో బంధీ అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు కేజీ టూ పీజీ విద్యను అమలు చేసి ఉంటే దళిత, గిరిజన పిల్లలు ఆత్మ గౌరవంతో ఎదిగేవారు. ఏడేళ్ల నుంచి మోసం చేస్తూ ఎన్నికలొచ్చినప్పుడే దళిత, గిరిజనులంటూ కేసీఆర్ మాట్లాడుతున్నాడు. దళిత బంధు పేరుపై బంధీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హుజూరాబాద్ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి.. అక్కడ దళితులు 48 వేల వరకు ఉన్నారని దళిత బంధు అంటూ మాట్లాడుతున్నారు. అమలుకు నోచుకోని హామీలతో మోసం చేస్తున్న కేసీఆర్ను రాజకీయంగా బొందపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.-మధుయాష్కీ, టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్