Madhuranagar Robbery Case : హైదరాబాద్ మహా నగరంలో చోరీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దొంగతనాలను తగ్గించడానికి పోలీసులు రాత్రి వేళల్లో నిత్యం పెట్రోలింగ్ చేస్తున్నా.. చోరీలకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరంలో వరుస చోరీలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. పక్కాగా రెక్కీ నిర్వహించుకుని.. అదను చూసి ఇళ్లకు కన్నం వేస్తున్నారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారు. డబ్బుతో పాటు బంగారం.. ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. తాజాగా మధురానగర్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం దాచుకున్న నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Hyderabad House Robbery Case : హైదరాబాద్‌లోని సారథి స్టూడియో వెనక ఉన్న మూడంతస్థుల భవనం పెంట్‌హౌస్‌లో గత 25 ఏళ్ల నుంచి ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణుడు వీఎల్ఎన్ చౌదరి అద్దెకు ఉంటున్నారు. 6 నెలల క్రితం ఇంటి యజమాని ఖాళీ చేయమని చౌదరికి చెప్పారు. దీంతో అప్పటి నుంచి ఇంటి కొనుగోలుకు చౌదరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి కొనుగోలు కోసం రూ.3.93 కోట్ల నగదు, 450 గ్రాముల బంగారం ఇంట్లోని పరుపు కింద, 3 సూట్‌కేసుల్లో దాచుకున్నారు.
Madhuranagar House Robbery Case : ఈ నెల 12న పని మీద బయటకు వెళ్లి.. రాత్రి 11.45 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో పెంట్ హౌస్ మెట్లు, గోడలు, తలుపులు దెబ్బతిని ఉండటాన్ని గమనించాడు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి దాచి ఉంచిన నగదు, బంగారు కడ్డీలు, 30 ల్యాప్‌టాప్‌లు, 3 సెల్ఫోన్లు, విలువైన పత్రాలు అన్నీ మాయమయ్యాయి. దీంతో చోరికి గురైనట్లు గుర్తించిన చౌదిరి.. గురువారం రాత్రి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఐ రవికుమార్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. నగదు, విలువైన వస్తువులు ఇళ్లల్లో దాచుకున్నప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. ఊళ్లల్లోకి వెళ్లేముందు ఇరుగుపొరుగు వారికి, వీలైతే పోలీసులకూ సమాచారం ఇచ్చి వెళ్లాలని చెబుతున్నారు. డబ్బు, బంగారం లాంటివి ఏవైనా ఉంటే.. కుదిరితే వెంట తీసుకువెళ్లడమో, లేదంటే బ్యాంకుల్లో దాచుకోవడమో చేస్తే అది దొంగల పాలు అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలు ఉన్నా.. దొంగలు మాత్రం దోపిడీలను ఆపడం లేదు. దొరికిపోతాం అన్న భయం ఏమాత్రం లేకుండా రెచ్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారానే దోపిడీలను అరికట్టవచ్చని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు.