హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ కరోనాతో మృతిచెందాడని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ.. మృతదేహాన్ని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని పేర్కొంది. కరోనా మార్గదర్శకాల ప్రకారం దహన సంస్కారాలు జరిపామని.. అదంతా వీడియో చిత్రీకరణ చేసినట్లు వైద్యారోగ్య శాఖ హైకోర్టుకు తెలిపింది.
చితాభస్మం భద్రపరిచామని.. మరణ ధ్రువీకరణ పత్రం కూడా సిద్ధంగా ఉందని నివేదించింది. కరోనాతో గాంధీలో చేరిన తన భర్త బతికే ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారంటూ మధుసూదన్ భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది.
వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం.. వీడియో రికార్డులు, చితాభస్మం, మరణ ధ్రువీకరణ పత్రం మధుసూదన్ భార్యకు అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది. మధుసూదన్ మరణించినందున.. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ ముగిస్తామని.. జీహెచ్ఎంసీ, ప్రభుత్వం తీరుపై అభ్యంతరాలుంటే మరో పిటిషన్ వేసుకోవాలని మధుసూదన్ భార్యకు హైకోర్టు సూచించింది.