హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి దహనానికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎక్కడికక్కడ శ్మశాన వాటికల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యంగా సర్కారు ఇచ్చిన ఆదేశాలను బల్దియా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. నెలన్నర కిందటే 10 ఎల్పీజీ దహన వాటికలను దిగుమతి చేసుకున్నా.. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో అక్కరకు రాకుండా పోయాయి. అదేమంటే వర్షాలను సాకుగా చూపుతున్నారు.
భాగ్యనగరంలో కోటి మంది జనాభా ఉన్నా పూర్తిస్థాయిలో ఆధునిక శ్మశానవాటికలు లేవు. కొత్తగా పదుల సంఖ్యలో బొందలగడ్డలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించాలనుకొంది. అదే సమయంలో కొవిడ్ మహమ్మారి విరుచుకుపడింది. కొవిడ్ మృతుల అంత్యక్రియలకు సమస్యలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ కొవిడ్ మృతుల అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఎల్పీజీతో పనిచేసే 10 దహనవాటికలను అందుబాటులోకి తేవాలని జీహెచ్‌ఎంసీకి సూచించారు. బల్దియా ఇంజినీర్లు హరియాణా రాష్ట్రంలోని అంబాల నుంచి యంత్రాలను నెలన్నర క్రితం తెప్పించారు. ప్రారంభించడంలోనే జాప్యం చేస్తున్నారు.
రెండు దహన వాటికలను ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నాం. ఉష్ణోగ్రతను పరీక్షించి అందుబాటులోకి తెస్తాం. మిగిలిన ఎనిమిది ఏర్పాటుకు షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వరుస వానలతో నిర్మాణం నెమ్మదించింది. మరో 20 రోజుల్లో అన్నీ సిద్ధమవుతాయి. సాంకేతిక నిపుణులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమూ ఆలస్యానికి కారణమే.
- డి.ఎస్.లోకేష్‌కుమార్, కమిషనర్, జీహెచ్‌ఎంసీ
ఇదీ చదవండిః ఏపీలో ఎల్పీజీ శ్మశాన వాటికల ఏర్పాటుకు సన్నాహాలు