పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు విద్యార్థుల హాజరు (students attendance) రెండో రోజు స్వల్పంగా పెరిగినా.. స్పందన అంతంత మాత్రంగానే ఉంది. నిన్న 21.77 శాతం విద్యార్థులు బడులకు హాజరు కాగా.. ఇవాళ ఆ శాతం 28.12 శాతానికి పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 37 వేల 768 పాఠశాలల్లో 52 లక్షల 52 వేల 303 విద్యార్థులు ఉన్నారు. ఇవాళ 14 లక్షల 76 వేల 874 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 38.82 శాతం హాజరు నమోదైంది. ఎయిడెడ్ పాఠశాలల్లో 15.04 శాతం విద్యార్థులే ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 21.74 శాతం విద్యార్థులే ప్రత్యక్ష తరగతులకు మొగ్గు చూపారు. పలు ప్రైవేటు పాఠశాలలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగుతులనే కొనసాగిస్తున్నాయి.
అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో (rajanna sircilla district)40.42 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు కాగా.. మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 17.26 శాతం హాజరు నమోదైంది. సోమవారం నాటికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
కరోనా ప్రభావంతో ఆన్లైన్ క్లాసులకే పరిమితమైన రాష్ట్రంలోని విద్యాసంస్థలు సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యాయి. భిన్నమైన వాదనలు, అభిప్రాయాల మధ్య ప్రత్యక్ష బోధనకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన మాత్రమే ఉంటుందని.. ఆన్లైన్ పాఠాలు ఇక ఉండదని తొలుత ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం,.. హైకోర్టు ఆదేశాలతో కొన్ని మార్పులు చేసింది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ఇంకా ప్రారంభం కాలేదు. మిగతా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు నిన్నటి నుంచి తరగతులు ప్రారంభించాయి. ప్రత్యక్ష బోధనపై ఆయా విద్యాసంస్థలే నిర్ణయం తీసుకొనే వెసులుబాటును ప్రభుత్వం ఇచ్చింది. పాఠశాలల్లో తరగతుల నిర్వహణపై కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు కొన్నాళ్లపాటు ఆన్లైన్లోనే బోధన కొనసాగిస్తామంటూ సందేశాలు పంపాయి.
డీహెచ్ ఏమన్నారంటే..
కొవిడ్, సీజనల్ వ్యాధుల లక్షణాలుంటే బడికి పంపొద్దని పిల్లల తల్లిదండ్రులకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు సూచించారు. 95 శాతం మంది పాఠశాలల సిబ్బందికి వాక్సినేషన్ పూర్తయిందన్నారు. టీకా తీసుకున్న సిబ్బందికే పాఠశాలల్లోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలో మాస్క్, తరచూ శానిటైజర్ వాడాలని కోరారు. మూడో వేవ్ గురించి శాస్త్రీయ ఆధారాలు లేవన్న డీహెచ్.. కొత్తరకం స్ట్రెయిన్ వస్తే తప్ప థర్డ్ వేవ్‌కు అవకాశం లేదన్నారు. కొవిడ్ వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతిన్నదని.. పిల్లల్లో విద్యపై ఆసక్తి తగ్గుతోందని పేర్కొన్నారు. పిల్లలు ఫోన్లకు బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల మానసిక స్థితి దృష్టిలో ఉంచుకునే పాఠశాలలు తెరిచామన్నారు.
ఇదీచూడండి: SCHOOLS REOPEN: బడి గంట మోగినా.. హాజరు అంతంత మాత్రమే!