Nama in pleanary: భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానాన్ని ప్లీనరీలో తెరాస లోక్‌సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులను కూడా హరించే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర జాబితాలో ఉన్న హక్కులను హరించి ఉమ్మడి జాబితాలో పెడుతున్నారని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలు రైతులను ఇబ్బందిపెట్టే విధంగా ఉన్నాయని.. వాటిని వ్యతిరేకించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడే చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దాదాపు 13 నెలల పాటు రైతులు ఆందోళన చేయడంతో.. ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేయడంతో పాటు క్షమాపణలు చెప్పారన్నారు.
విద్యుత్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తోందని ఎంపీ నామ నాగేశ్వరరావు వెల్లడించారు. మోటార్ల వద్ద మీటర్లు పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ బిల్లును ఒప్పుకునే ప్రసక్తే లేదని... రెండు సభల్లోనూ అడ్డుకోవాలని కేసీఆర్ సూచించారన్నారు. రాష్ట్రాలను ఇబ్బందిపెట్టే విధంగా కేంద్రం విధానాలున్నాయని ఆయన విమర్శించారు. భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ ద్వారా అణగదొక్కాలని కేంద్రం యత్నిస్తోందని నామ నాగేశ్వరరావు ఆరోపించారు. విభజన చట్టంలో ఉన్న విషయాల్లో కూడా తెలంగాణకు ఇంతవరకు న్యాయం చేకూర్చలేదన్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని నామ నాగేశ్వరరావు అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తోంది. విద్యుత్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం యత్నిస్తోంది. ఈ బిల్లును రెండు సభల్లోనూ అడ్డుకోవాలని కేసీఆర్ సూచించారు. భాజపాయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ ద్వారా అణగదొక్కాలని కేంద్రం యత్నిస్తోంది. తెలంగాణపై కేంద్రం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోంది. -నామ నాగేశ్వరరావు, ఎంపీ
ఇవీ చదవండి: