Lok Sabha Speaker on Bandi Sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సంజయ్ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఓం బిర్లా పంపారు. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించింది.
జాగరణ దీక్ష ఉద్రిక్తం...
ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష అనంతర పరిణామాలు ఆయన జ్యుడిషియల్ రిమాండ్‌కు దారితీశాయి. సోమవారం పోలీసులు సంజయ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. సంజయ్‌ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు.
భాజపా ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్‌లో సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతోపాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్, మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్ సహా ఆరుగురిని కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
తన హక్కులకు భంగం కలిగిందంటూ బండి సంజయ్ స్పీకర్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు. సంజయ్ పంపిన లేఖపై ఇవాళ స్పీకర్ స్పందించారు.
ఇవీ చూడండి: