రాష్ట్రంలోకి ఎడాది మిడతల దండు ప్రవేశించే ప్రమాదం ఉన్నట్లు మరోసారి తాజాగా హెచ్చరికలు జారీ అయ్యాయి. మహారాష్ట్ర నుంచి వచ్చి దాడి చేసే ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం... సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేసింది. దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతం గురుగ్రామ్‌లో మిడతలు ప్రభావం కనిపించడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ తో పాటు కామారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి... మొత్తం 9 జిల్లాలకు ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ దాడిచేస్తే... వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
దాడి చేసే అవకాశం ఉంది
ఒక్కో జిల్లాలో రూ.5.95 లక్షల వ్యయంతో పీపీ కెమికల్స్, పీపీఈ కిట్స్ కొనుగోలు చేసి సమకూర్చుకోవాలని సూచించింది. అందుకోసం విపత్తు నిర్వహణ సంస్థ నిధుల నుంచి రూ.53.55 లక్షలు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్థన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట కాలం మొదలైన నేపథ్యంలో జులై మొదటి వారంలో మిడతల దండు దాడి రాష్ట్రానికి ఉండవచ్చని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ మిడతల హెచ్చరికల కేంద్రం శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
కలెక్టర్ల పర్యవేక్షణ
మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాల్లోకి రాకుండా ఎక్కడికక్కడ నియంత్రించాలని ఇటీవల సమీక్షించిన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తూ... వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు అధికారయంత్రాంగం, రైతులను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తాం: మంత్రి కేటీఆర్