లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున ఉదయం వేళ ఇంటికి ఒకరు చొప్పున బయటకు వచ్చి నిత్యావసరాలు కొని తెచ్చుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. సాధ్యమైనంత త్వరగా పనులు ముగించుకొని ఇళ్లకే పరిమితం కావాలని, బయట తిరగొద్దని స్పష్టంగా పేర్కొంది. అయినా కొందరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న కారణాలు చెబుతూ వాహనాలపై బయటకు వస్తున్నారు.
సాయంత్రం వరకూ రహదారులపై తిరుగుతూనే కన్పిస్తున్నారు. నిత్యావసరాలు, పాలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తున్నామని చెబుతున్నా... అనవసరంగా బయటకు వస్తున్న వారే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఇష్టారాజ్యంగా రాకపోకలు సాగిస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నా రాకపోకలకు మాత్రం బ్రేకులు పడడంలేదు.
ఎందుకు రోడ్లపై తిరుగుతున్నారని పోలీసులు ప్రశ్నిస్తే... ఒకరు ఆవులకు గడ్డి కోసం వెళుతున్నా అని, మరొకరు పాప ఐస్‌క్రీం కోసం మారాం చేస్తుంటే తీసుకొద్దామని ఉస్మానియా ఆసుపత్రి వద్దకు వెళుతున్నాం అంటూ సిల్లీ కారణాలు చెబుతూ రోడ్లపైకి వస్తున్నారు.
ప్రయాణికుల ఆటోలు తిరిగేది ఈ ఠాణాల పరిధిలోనే..
చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, శాలిబండ, మొగల్‌పురా, డబీర్‌పురా, కంచన్‌బాగ్, చంచల్‌గూడ, మీర్‌చౌక్, భవానీనగర్, రెయిన్‌బజార్, చార్మినార్, కాలాపత్తర్, హుస్సేనిఆలం.
పోలీసులకే ఎదురు ప్రశ్నలు!
కూడళ్ల వద్ద, తనిఖీ ప్రాంతాల వద్ద పోలీసులు ప్రశ్నించినప్పుడు ఏమాత్రం నమ్మశక్యంగా లేని కారణాలు చెబుతున్నారు. కొందరు పగలు బయటకు వెళ్లొచ్చుగా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వస్తున్నా... ఆగడంలేదు. అరుగులపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్తున్నారు. కొన్నిచోట్ల ప్రయాణికుల ఆటోలూ తిరుగుతున్నాయి. ప్రధాన మార్గాల్లో పోలీసులుంటున్నందున అనుసంధాన మార్గాలు, గల్లీల్లో నడుస్తున్నాయి. నిత్యావసర సేవల వాహనాల్లోనూ ప్రయాణికులను తీసుకెళ్తున్నారు.
రద్దీగా ఉంటున్న కొన్ని రహదారులు
- చాంద్రాయణగుట్ట నుంచి నయాపూల్ వరకు.
- కంచన్‌బాగ్ నుంచి జూపార్క్ వరకు.
ఇదీ చూడండి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు