నిలిచిన రవాణా, మార్కెట్ల మూసివేతకు తోడు కూలీ ఖర్చులకు సరిపడని ధరలతో టమాటా రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. మార్కెట్లో రెండు మూడు రూపాయలకు మించని టమాటా ధర చిల్లర మార్కెట్లో మాత్రం పది రూపాయలకు మించుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కరోనా ఉద్ధృతితో రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుండగా... వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే మార్కెట్లు తెరిచి ఉంటుండగా... ఈ సమయంలోనే రైతులు తమ పంట విక్రయించాల్సి వస్తోంది. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలను ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి విక్రయించలేక పొలాల్లోనే వదిలేస్తున్నారు. ముఖ్యంగా టమాటా రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వేల రూపాయలు ఖర్చు చేసినా... అతికష్టం మీద చేతికొచ్చిన పంట కిలో ధర 3 నుంచి 4 రూపాయలు మించటంలేదు.
ఆశలు తలకిందులు
సాధారణంగా వేసవి వచ్చిందంటే టమాటకు గిరాకీ అమాంతం పెరిగిపోతుంది. ఈ ఆలోచనతోనే టమాటా సాగుకు రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. ఒక్కో ఎకరం విస్తీర్ణంలో టమాట సాగుకు 40 వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది. సస్యరక్షణ, యాజమాన్య చర్యలు, కలుపు నివారణ, కూలీల ఖర్చు, రవాణ ఖర్చులు ఇలా తడిసిమోపడవుతుండగా... ఈ కష్టాలన్నీ అధిగమించి, మార్కెట్‌కు తీసుకెళ్లటం మరో ఎత్తు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ అన్నదాతల ఆశలను తలకిందులు చేశాయి. గతేడాది వేసవిలో ఈ పరిస్థితులనే ఎదుర్కొన్న రైతులు... ఆర్థికంగా భారీ నష్టాలు చవిచూశారు. ప్రస్తుత లాక్‌డౌన్‌తో నిస్సహాయ పరిస్థితులు ఉత్పన్నమవుతుండటం, సరైన ధర లేక పంట వదిలేస్తూ పశువులకు మేతగా మేపుతున్నారు. ప్రస్తుతమున్న ధరలు కనీసం కూలీలకిచ్చేందుకు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు.
ఆకుకూరలదీ ఇదే పరిస్థితి
టమాటతో పాటు క్యారట్, బీట్‌రూట్, వంకాయ, క్యాబేజీ, కాప్సికం, కారక, బీరకాయ, పచ్చిమిరపతో పాటు ఆకుకూరలదీ ఇదే పరిస్థితి. లాక్‌డౌన్ దృష్ట్యా మార్కెటింగ్ సరళతరం చేయడంతోపాటు కొత్త పంట కోసం విత్తనాలు, నారు ఉచితంగా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఉపాధి లేకపోవటంతో వ్యవసాయం చేస్తున్న ఉపాధ్యాయుడు