పర్యాటక ప్రాంతాలకు నెలవు మన భాగ్యనగరం. దేశవిదేశాల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలను చూసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు నిత్యం వస్తుంటారు. చారిత్రాత్మక ప్రదేశాలైన చార్మినార్, గోల్కొండ, మక్కామసీద్ ను తిలకించేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. వీటితో పాటు నగరంలోని లుంబినీ పార్క్‌లో బోటింగ్, లేజర్ షోను పర్యాటకులు ఆస్వాదిస్తారు. లాక్ డౌన్‌తో పర్యాటక రంగ ప్రవేశానికి బ్రేకులుపడ్డాయి.
తిరిగి లాక్ డౌన్…
గత లాక్ డౌన్ లో పర్యాటక సంస్థ ఆర్థికంగా అనేక నష్టాలు చవిచూసింది. లాక్ డౌన్ సడలింపు తర్వాత పర్యాటక ప్రదేశాలకు అనుమతి ఇవ్వడం వల్ల తిరిగి పర్యాటక రంగం పుంజుకుంది. నగరంలోని పలు ప్రదేశాలు చూసేందుకు తిరిగి పర్యాటకులు ఆసక్తికనబరిచారు. ఇంతలోనే కరోనాను కట్టడి చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి లాక్ డౌన్ ను విధించింది. దీంతో తిరిగి పర్యాటక ప్రాంతాలన్నీ...బోసిపోతున్నాయి.
ఖాళీగా…
నగర నడిబొడ్డున ఉన్న లుంబినీపార్క్ బోటింగ్, లేజర్ షో చూసేందుకు పిల్లలు, పెద్దలు వస్తుంటారు. అలాంది ఇప్పుడు బోట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. లేజర్ షో... కళావిహీనంగా కనిపిస్తోంది. అందులో పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు. ప్రస్తుతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. లుంబినీపార్క్ బోటింగ్, దుర్గంచెరువు, తారామతి-బారామతి, గోల్కొండ కోట తదితర ప్రాంతాల్లో పనిచేసే పొరుగు సేవల సిబ్బందికి గత లాక్ డౌన్ లో నాలుగు నెలలపాటు సగం జీతం మాత్రమే ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెలలో జీతం ఎంతిస్తారో అని పొరుగు సేవల సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
- ఇదీ చూడండి: తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!