ఎంత దూరంలో ఉన్న వ్యక్తికైనా క్షణాల్లో సమాచారం చేరవేయడానికి ఉపయోగపడేది చరవాణి. యాచకుడి నుంచి కోటీశ్వరుడి వరకు ప్రతి ఒక్కరూ చరవాణి వినియోగిస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం చరవాణి క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. సాధారణంగా 10వేలు అంతకంటే తక్కువ ధర ఉన్న చరవాణిలు ఎక్కువగా అమ్ముడవుతాయి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఈ తరహా మొబైళ్లు అందుబాటులో లేవు. ప్రస్తుతం కంపెనీల నుంచి ఉత్పత్తి, సరఫరా లేకపోవడం వల్ల.. దుకాణాల్లోనూ నిల్వలు లేకుండా పోయాయి.
ఆన్‌లైన్ బోధన..
చరవాణి విక్రయాలకు, మరమ్మతులకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్నది అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్. ఇక్కడ ఒకేచోట దాదాపు 500 దుకాణాల వరకు ఉన్నాయి. అన్ని రకాల ఫోన్లు ఇక్కడ దొరుకుతాయి. కొత్తవే కాక పాత ఫోన్లు సైతం ఈ మార్కెట్లో విక్రయిస్తారు. ప్రస్తుతం పాఠశాలలు ఆన్‌లైన్ బోధన వైపు మొగ్గుచూపుతుండటంతో ట్యాబ‌్‌లకు గిరాకీ పెరిగినా.... మార్కెట్‌లో అందుబాటులో లేకపోవడంతో జనం ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు.
కంపెనీల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమై... మార్కెట్‌లోకి అన్ని ధరల్లో చరవాణి అందుబాటులో వచ్చిన తర్వాతనే వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి : బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురికి కరోనా