హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భవన యజమాని తాళం వేశారు. భోలక్‌పూర్‌లోని రంగానగర్‌లో ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి తొమ్మిది నెలలుగా వైద్యారోగ్య శాఖ అద్దె చెల్లించని కారణంగా యజమాని తాళం వేశారు.
నెలనెలకు భవన అద్దె చెల్లిస్తామంటూ సంబంధిత వైద్యారోగ్య శాఖ అధికారులు దాటవేస్తూ వస్తున్నారని భవన యజమాని వాపోయారు. ఏం చేయాలో పాలుపోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడితో పాటు సిబ్బంది ఆశావర్కర్లు నిరసన తెలిపారు.
వైద్య సిబ్బంది భవన యజమానిని వేడుకుని... ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అప్పటికే అనేక మంది గర్భిణీలు, రోగులు ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళ్లారు. భోలక్‌పూర్‌లోని కొన్ని మురికివాడల ప్రాంతాల చిన్నారులకు నెలవారి టీకాలు కూడా ఇవ్వాల్సి ఉంది. పేదవారికి సేవలు అందించే ఆస్పత్రికి తాళం వేస్తే వారికి వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంటుందని సిబ్బంది చెబుతున్నారు. అద్దె భవనం కాకుండా శాశ్వత భవనం నిర్మించాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.
ఇదీ చూడండి: గడ్డివాములో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు మృతి