Assembly and Council Sessions February 3rd: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బులెటిన్ జారీ చేసిన శాసనసభ సచివాలయం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చింది. అసెంబ్లీ రెండో సెషన్‌కు సంబంధించిన నాలుగో సమావేశం.. కౌన్సిల్ 18వ సెషన్‌కు సంబంధించిన.. నాలుగో సమావేశం ఆ రోజు నుంచి ప్రారంభమవుతున్నట్లు పేర్కొంది. ఉభయసభలు విడివిడిగా ఆ రోజు మధ్యాహ్నం 12:10 గంటలకు సమావేశం కానున్నాయి.
నేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టడంతోనే శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగానే ఈ మారు కూడా ఉభయసభల సమావేశాలు జరగనున్నాయి. దీంతో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగానికి అవకాశం లేదు. సమావేశాల పనిదినాలు.. ఎజెండా, చర్చించే అంశాలపై సభా వ్యవహారాల సలహా సంఘం - బీఏసీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు 2022-23 ఆర్ధిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ కసరత్తను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ మేరకు ప్రగతిభవన్‌లో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు సహా అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్‌లో వివిధ పథకాలకు కేటాయింపులతో పాటు కేంద్రం నుంచి.. రాష్ట్రానికి రానున్న నిధులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఆర్ధిక శాఖ ప్రతిపాదనలు సమర్పించింది. డిసెంబర్ వరకు చెల్లించాల్సిన శాఖల వారీగా చెల్లించాల్సిన బకాయిలతోపాటు.. కొత్త ఉద్యోగాల భర్తీకి చెందిన వివరాలు సమర్పించాలని ఆయాశాఖలను ఆర్ధికశాఖ ఆదేశించింది. వాటిని పూర్తిస్థాయిలో క్రోడీకరించే ప్రక్రియను అధికారులు చేపట్టారు .
ఇవీ చదవండి: దావోస్ వేదికగా రాష్ట్రానికి రూ.21వేల కోట్ల పెట్టుబడులు: కేటీఆర్
రంగంలోకి INS వాగీర్.. డ్రాగన్ నౌకల మారణాస్త్రం.. దాడి చేస్తే చావుదెబ్బే!