కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణలోకి రావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి(ఏఐకేఎస్‌సీసీ) పిలుపు మేరకు 'చలో దిల్లీ' కార్యక్రమానికి వెళ్తున్న రైతులపై కేంద్ర నిర్బంధాన్ని నిరసిస్తూ వామపక్షాలు నిరసన చేపట్టాయి. ఈ మేరకు హైదరాబాద్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి తమ్మినేని హాజరయ్యారు. శాంతియుతంగా దిల్లీ వెళ్తున్న రైతులపై బాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జి చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తుందని చాడ స్పష్టం చేశారు.
చట్టాలను ఉపసంహరించుకోవాలి
రైతు ఆదాయం రెండింతలు చేయడం అంటే నిర్బంధం, లాఠీఛార్జి చేయడమా మోదీజీ అంటూ నేతలు ప్రశ్నించారు. కార్పొరేట్ శక్తుల నుంచి వ్యవసాయం, రైతన్నలని కాపాడుకుందాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వేచ్ఛా మార్కెట్ చట్టం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. శాసన సభలో చేసిన తీర్మానాలకు కేసీఆర్ పరిమితం కాకుండా భాజపా వ్యతిరేక శక్తులన్నీ ముందుకొచ్చి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: బల్దియా బరిలో ఎంఐఎం జోరు.. ప్రభుత్వాల తీరుపై ఓవైసీ బ్రదర్స్ ఫైర్