డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మాఫీ చేస్తానంటూ ఐటీ ఉద్యోగిని మోసం చేసిన న్యాయవాదిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. చందానగర్ ప్రాంతానికి చెందిన వెంకటపవన్ కుమార్ గత నెల 16న మద్యం తాగి గచ్చిబౌలి ప్రాంతంలో వాహన తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసిన అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు పవన్‌కుమార్‌కు జైలు శిక్ష విధించింది. దీని నుంచి తప్పించుకునేందుకు స్థానిక న్యాయవాది భానుప్రసాద్‌ను సంప్రదించాడు. అతను కేసు మాఫీ చేయడమే కాకుండా... వాహనాన్ని విడిపిస్తానని చెప్పి రూ.70 వేలు డిమాండ్ చేశాడు. రూ.40 వేల విలువైన ఒక ఆపిల్ వాచ్, పదివేల నగదు ముందుగా ఇచ్చాడు. తరువాత న్యాయవాది నుంచి ఎలాంటి స్పందన లేదు. గత నెల 29 నుంచి మూడు రోజులు పాటు పవన్ జైలు శిక్ష అనుభవించాడు. మోసపోయానని గ్రహించిన అతను న్యాయవాది భానుప్రసాద్‌పై కేపీహెచ్‌బీ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం నిందితుణ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఇదీ చూడండి : గంజాయి స్వాధీనం... ఆరుగురు అరెస్ట్