Metro Super Saver Card: హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. సెలవు రోజుల్లో వినియోగించుకునేలా సూపర్ సేవర్ కార్డును ప్రారంభించారు. సెలవు రోజుల్లో 59 రూపాయలతో రోజంతా మెట్రో రైల్లో తిరిగేలా ఆఫర్ ప్రకటించారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో వర్తింపు ఉంటుందని.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని మెట్రో ఎండీ కె.వి.బి.రెడ్డి తెలిపారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయని వెల్లడించారు. ఐదుగురు మెట్రో ప్రయాణికులకు లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి సువర్ణ ఆఫర్ విజేతలుగా ప్రకటించి.. బహుమతులు అందజేశారు.
కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలు పుంజుకుంటున్నాయి. సెలవుల్లో రూ.59తో రోజంతా మెట్రోలో తిరగొచ్చు. అయితే తొలుత సూపర్ సేవర్ కార్డును రూ.50తో కొనుగోలు చేయాలి. ప్రతీసారి అదే కార్డులో రీఛార్జి చేసుకోవాలి. మెట్రో ప్రకటించిన 100 సెలవు రోజుల్లో మాత్రమే కార్డు వినియోగానికి అనుమతి. సెలవుల్లో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చు.
-- కె.వి.బి.రెడ్డి, మెట్రో ఎండీ
ఉగాది నుంచి: ఉగాది నుంచి మెట్రోలో సూపర్ సేవర్ కార్డులు విక్రయించనున్నట్లు ఎండీ ప్రకటించారు. ఏడాదిలో కేటాయించిన 100 సెలవు రోజుల్లో కార్డు లభ్యవుతుందని తెలిపారు. ప్రకటించిన సెలవు రోజులు ప్రతి ఆదివారం, ప్రతి రెండు, నాలుగో శనివారంతో పాటు ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగష్టు 15, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, బాక్సింగ్‌డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి వంటి పండుగ రోజుల్లో సూపర్ సేవర్ కార్డుతో ప్రయాణించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఇదీచూడండి: పెరిగిన ఎండల తీవ్రత... బడి వేళలు తగ్గించిన విద్యాశాఖ