Last Nizam of Hyderabad Funeral Controversy : ఏడో నిజాం మీర్‌ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా బహదూర్ (మీర్ బరాకత్ అలీఖాన్) (89) తుర్కియేలో కన్నుమూశారు. శనివారం అర్ధరాత్రి ఇస్తాంబుల్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భౌతికకాయాన్ని మంగళవారం ఇస్తాంబుల్ నుంచి శంషాబాద్‌కు తీసుకురానున్నారు. సాయంత్రం 5 గంటలకు విమానాశ్రయం నుంచి చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకొస్తారు.
బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాధారణ ప్రజలు భౌతికకాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. 3 గంటల తర్వాత మక్కామసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్‌ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహిస్తారు.
‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా గుర్తింపు.. ఉస్మాన్ అలీఖాన్ పెద్దకుమారుడు అజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబరు 6న ముకర్రమ్ ఝా జన్మించారు. ఆయన తల్లి దుర్రె షెహవార్.. టర్కీ చివరి సుల్తాన్ (ఒట్టోమాన్ సామ్రాజ్యం) అబ్దుల్ మెజిద్ కుమార్తె. ఉస్మాన్ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు..అజంఝా, మౌజంఝా. వీరిని కాదని అజంఝా కుమారుడు ముకర్రమ్ ఝాను 8వ నిజాంగా ఉస్మాన్‌అలీఖాన్ ప్రకటించారు. 1971లో భారత ప్రభుత్వం రాజాభరణాలు రద్దు చేసే వరకు.. ముకర్రమ్ ఝాను అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. ఆయనకు నలుగురు భార్యలు (ఎస్రా, హెలెన్, మనోలియా ఒనూర్, ఒర్చిడ్), అయిదుగురు సంతానం ఉన్నారు.
వారసత్వంగా ఆస్తులు.. అద్దె గదిలో మరణం..: ఉస్మాన్‌అలీఖాన్ అప్పట్లో ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు వారసుడిగా.. ముకర్రమ్‌ఝా సైతం చిన్నతనంలోనే ప్రపంచ కుబేరుడయ్యారు. అనంతరం విలాసాలకు, ఆర్భాటాలకు పోయి దివాలా తీశారు. భార్యలతో విభేదాల కారణంగా మనోవర్తి కేసులు, ఇతర ఆస్తి వివాదాలతో సతమతమయ్యారు. ఆయన సంతానం సైతం ఆస్తి కోసం కేసులు వేయడం, హైదరాబాద్‌లోని మేనత్తలు, వారి వారసులు కోర్టుకెక్కడంతో నగరంలోని ఆస్తులను అమ్మడానికి వీల్లేకుండా కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో ఓ దశలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. చివరికి ముకర్రమ్‌ఝా ఇస్తాంబుల్‌లోని ఓ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కే పరిమితమయ్యారని ‘ది లాస్ట్ నిజాం.. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్‌లీ స్టేట్’ అనే పుస్తకంలో ఓ విదేశీ జర్నలిస్టు పేర్కొన్నాడు.
అత్యున్నత లాంఛనాలతో..: ముకర్రమ్‌ఝా మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజాం వారసుడిగా, పేదల కోసం విద్యా వైద్యరంగాల్లో ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌కు సీఎం సూచించారు.
రేవంత్, వీహెచ్ సంతాపం..: ముకర్రమ్‌ఝా మృతి పట్ల పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియచేశారు. బ్రహ్మానందరెడ్డి పార్కు స్థలం ఆయనదేనని, ప్రజలకు ఉపయోగపడుతుందని ఇచ్చారని వీహెచ్ గుర్తుచేశారు.
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: ముకర్రమ్ ఝా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. నిజాం వ్యతిరేక పోరాటంలో నాటి ప్రజల త్యాగాలను అవమానించేలా ప్రభుత్వ నిర్ణయం ఉందని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగడాకుల బాలస్వామి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆస్తి గొడవలతో వార్తల్లోకి..: హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లోని సంస్థానం ఖాతా నుంచి పాకిస్థాన్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ రహమతుల్లా ఖాతాల్లోకి రూ.3.5 కోట్ల నగదు బదిలీ అయ్యింది. ఈ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లోనే ఉస్మాన్ అలీఖాన్ కోరినా.. పాకిస్థాన్ పేచీతో వివాదం అరవై ఏళ్లు నలిగింది. ఆ తర్వాత లండన్ బిజినెస్ అండ్ ప్రాపర్టీ హైకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఉస్మాన్ అలీఖాన్ తరఫున అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి మీర్ నవాజ్ జంగ్ జమ చేసిన నిధులకు ఆయన కుమారులు అజంఝా, మౌజంఝా వారసులని (మనవలు ముకరంఝా, ముఫంఝా) తేల్చి పాకిస్థాన్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అప్పట్లో జమ చేసిన రూ.3.5 కోట్లు వడ్డీలతో రూ.306 కోట్లు అయ్యాయి. ఈ తీర్పుతో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చింది.
ఇవీ చూడండి..
భారీ హోర్డింగ్‌లు.. నేతల కటౌట్లతో ఖమ్మం నగరం.. గులాబీమయం
పౌరుడి పాదాలను కడిగిన రాష్ట్రమంత్రి.. రోడ్లు సరిగ్గా లేవని క్షమాపణ