అమ్మా బైలెల్లినాదో.... తల్లీ బైలెల్లినాదో అంటూ హుషారైన పాటల హోరు, పోతురాజుల హంగామా, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు సందడి చేస్తున్నాయి. ఈ నెల 4వ తేదీన గోల్కొండ కోటలోని జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమైన ఉత్సవాలు ఆగస్టు 1 వరకు కొనసాగుతాయి. నేడు, రేపు ఉజ్జయిని మహంకాళీ బోనాల ఉత్సవాలు జరుగుతాయి.
బోనాలకు వందల ఏళ్ల చరిత్ర
భాగ్యనగర బోనాలకు రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1869లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలి... ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అమ్మవారికి కోపం వచ్చిందని... ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు జాతర నిర్వహించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ సంస్కృతే అనంతరం బోనాల పండగగా కొనసాగుతూ వచ్చింది. భాగ్యనగరాన్ని మూసీ నది వరదలు ముంచెత్తుతున్న కాలంలో... వరదలు తగ్గితే నది గట్టున ఉన్న అమ్మవారికి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తామని తానీషా ప్రభువు మొక్కుకున్నాడని... అప్పటి నుంచి బోనాలు నిర్వహిస్తున్నారని మరి కొంతమంది చెబుతుంటారు.
ఘటాల ఊరేగింపుతో ప్రారంభం
బోనాల ఉత్సవాలు ఘటాల ఊరేగింపుతో ప్రారంభమవుతాయి. కలశాన్ని అమ్మవారి రూపంలో అలంకరించి ఊరేగిస్తారు. అంటే అమ్మవారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. బోనం సమర్పించేందుకు మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి... బెల్లంతో అన్నం వండుతారు. ఆ భోజనాన్ని వేపాకులతో అలంకరించిన మట్టి కుండలో పెట్టి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపై మూత, ఆ పైన దీపం పెట్టి గుడికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.
సందడిగా తొట్టెల ఊరేగింపు
బోనాల జాతరలో తొట్టెల ఊరేగింపు సందడిగా సాగుతుంది. పోతురాజుల విన్యాసాలు ఆద్యంతం ఆట్టుకుంటాయి. పోతురాజు అమ్మవారి సోదరుడు.. ఊరిని కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఒళ్లంతా పసుపు రాసుకుని, పెద్ద బొట్టు పెట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని, ఎర్రని నాలుక బయటికి పెడుతూ పెద్ద శబ్దాలతో పోతురాజు వేషధారులు ఊరేగింపులో పాల్గొంటారు.
లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
బోనాల కోసం జంట నగరాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకుని కోరికలు తీర్చాలని వేడుకుంటారు. బోనాలు సమర్పించి సల్లంగ చూడాలని వేడుకుంటారు.
ఇవీ చూడండి: లష్కర్ బోనాలకు ఏర్పాట్లు పూర్తి