నూతన సంస్కరణల వల్ల వంద రోజుల పాటు స్తబ్ధత, కొవిడ్ కారణంగా వ్యాపారం మందగించడం వంటి కారణాలతో... రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి మూడున్నర నెలలకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. గతేడాది సెప్టెంబరు 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా... భారీఎత్తున క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అయితే రిజిస్ట్రేషన్లను పునరుద్ధరించాలని నిర్ణయించడం వల్ల... గత నెల రోజుల నుంచి మళ్లీ సందడి మొదలైంది. డిసెంబరు మూడో వారం నుంచి ఇప్పటివరకు ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా ఈ నెల రోజుల్లో 21 వేల 75 రిజిస్ట్రేషన్లు జరగ్గా... 42 కోట్ల 71 లక్షల ఆదాయం వచ్చింది.
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో... నిత్యం సందడి కనిపిస్తోంది. గతేడాది ఆగస్టుకు ముందు గల వాతావరణం అన్నిచోట్లా పునరావృతమవుతోంది. రిజిస్ట్రేషన్లు నిలిపివేయకముందు మూడు జిల్లాల పరిధిలో నిత్యం సగటున... 700 నుంచి 900 వరకు నమోదయ్యేవి. సరాసరి యాదాద్రి జిల్లాలో 300-400, నల్గొండ జిల్లాలో 250-350, సూర్యాపేట జిల్లాలో 130-160 వరకు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. దీని ద్వారా రోజూ 1.5 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. ఇపుడు అదే స్థాయిలో దస్తావేజుల ప్రక్రియ కోసం... జనం కార్యాలయాలకు చేరుకుంటున్నారు. రాబడి సైతం ఇంతకుముందులాగే క్రమంగా వృద్ధి చెందుతోంది. అత్యధిక దస్తావేజుల నమోదులో నల్గొండ ప్రథమ స్థానంలో నిలవగా... ఆదాయంలో మాత్రం చౌటుప్పల్ ముందువరుసలో ఉంది.
నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 3 వేల 538 రిజిస్ట్రేషన్లు జరగ్గా... 6.96 కోట్ల ఆదాయం వచ్చింది. చౌటుప్పల్లో 12 వందల 33 దస్తావేజులకు గాను 7.86 కోట్లు సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల పరిధిలో మొత్తం ఆదాయం 42.71 కోట్లు ఉంటే... ఏడు పట్టణాల పరిధిలోనే 35.48 కోట్లు నమోదైంది.