ఆంధ్రప్రదేశ్ విశాఖలో పరిశ్రమల స్థాపన, గుంటూరులో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి ఉద్దేశించిన భూములను సర్కారు వేలం ద్వారా అమ్మబోతోంది. వీటి రిజర్వు ధరను రూ. 106 కోట్ల 90 లక్షలుగా ప్రకటించినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో అంతకన్నా ఎక్కువే పలుకుతున్నాయి. వేలంలో ఎక్కువ ధరకు కొనుగోలు చేసిన వారికే ఈ భూములు కేటాయించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ ఈ-వేలం ప్రకటన ఇచ్చింది. ఈ నెల 23 నుంచి 25 మధ్య జరిగే వేలంలో పాల్గొనదల్చినవారు ఈ నెల 23 వరకూ ప్రీ-బిడ్ ఈఎండీ చెల్లించవచ్చని తెలిపింది.
పారిశ్రామిక భూముల అమ్మకం
విశాఖలో పారిశ్రామిక అవసరాలకు ఫకీరు తక్యాలో ఏపీఐఐసీకి కేటాయించిన భూముల్లో 3.32 ఎకరాలను ప్రభుత్వం విక్రయించనుంది. ఈ ప్రాంతం చుట్టూ పరిశ్రమలు, పూర్తి స్థాయి మౌలిక వసతులతో బాగా అభివృద్ధి చెందింది. ఏపీఐఐసీ భూముల్లో ఇప్పటికే వోల్టా ఫ్యాషన్, రిలియన్ సీడీఐటీ, హెచ్ఎండీ, హిందుస్థాన్ మిడ్‌టెక్, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలున్నాయి. ఈ 3 ప్రాంతాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఫకీరుతక్యాలో ఏపీఐఐసీకి చెందిన సర్వే నంబర్ 100-9లోని 1.93 ఎకరాలను పచ్చదనం పెంపొందించేందుకు అధికారులు కేటాయించారు. ఈ ప్రాంతంలో మొక్కలూ పెంచారు. దీన్నే ఇప్పుడు అమ్మబోతున్నారు. విశాఖలో చినగదిలిలో హోంశాఖకు చెందిన ఎకరం భూమి, ఇదే ప్రాంతంలో రెవెన్యూకు చెందిన 75 సెంట్లు, అగనంపూడి రెవెన్యూకు చెందిన 50 సెంట్లు, సీతమ్మధారలో రెవెన్యూశాఖ వారి ఎకరం భూమిని విక్రయించనున్నట్టు ప్రకటించారు.
గుంటూరు నగరం నల్లపాడులో 6.07 ఎకరాలు, శ్రీనగర్ కాలనీలోని 5.44 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించనుంది. నల్లపాడులో గుంటూరు-నరసరావుపేట ప్రధాన రహదారిలో తాగునీటి అవసరాల కోసం సమ్మర్‌స్టోరేజీ ట్యాంకు నిర్మాణానికి గతంలో ఈ భూమిని కొనుగోలు చేశారు. ఇదే స్థలంలో చేపల మార్కెట్ నిర్మాణానికీ ప్రతిపాదన ఉంది. శ్రీనగర్ కాలనీలో నగరం మధ్యలో ఉన్న 5.44 ఎకరాల కార్మిక శాఖ భూమిలో రాష్ట్ర విభజన అనంతరం పోలీసుశాఖ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ప్రయత్నించినా కుదర్లేదు.
మెరుగైన వైద్యం అందించేందుకు
ఇక్కడ మొత్తంగా 11 ఎకరాల భూమి ఉండగా ఇందులో 6 ఎకరాలు గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు కేటాయిస్తూ ఇటీవలే మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొత్తం 11 ఎకరాలనూ జీజీహెచ్ విస్తరణకు కేటాయిస్తే భవిష్యత్‌లో నూతన వైద్య విభాగాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడే ఉన్న ఆ 5.44 ఎకరాలను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఇదీ చదవండి: వైద్యుడు మనిషి రూపంలో ఉన్న దేవుడు: ఈటల