మహానగరంలోని ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల పడకలు ఖాళీ లేకపోవడంతో అప్పటికే ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పడిపోయి ఊపిరి అందక చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అటు ప్రైవేటు ఆస్పత్రుల్లో.. ఇటు గాంధీ, టిమ్స్‌లో ఈ పడకలు ఖాళీ లేవు. ఒకటి రెండు ఉన్నా.. ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించిన వారిని వాటిలోకి మారుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ పడకలను పెంచడానికి ప్రయత్నిస్తోంది గానీ.. వెంటిలేటర్ పడకల సంఖ్యను పెంచడంపై దృష్టిసారించడం లేదు. అదే ప్రైవేటులో కొన్ని ఆస్పత్రులు వీటి సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నా కూడా సంబంధిత సంస్థలు యంత్రాలను సమకూర్చలేని పరిస్థితి ఏర్పడింది.
ఎక్కడ చూసినా..
ఊపిరితిత్తులు అధికంగా దెబ్బతిన్న వారికి వెంటిలేటర్ అవసరం ఉంటుంది. నగరంలో దాదాపు రెండువేల ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్ల సౌకర్యం ఉంది. ప్రస్తుతం వందలాదిమంది రోగులతో ఆయా పడకలు నిండిపోయాయి. కొంతమంది రోగులు పది రోజులున్నా కోలుకోవడం లేదు. దీంతో పడకలు ఖాళీ కావడం లేదు. ఒకటి రెండు ఖాళీ అయినా అప్పటికే రిజర్వు అయిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. గాంధీలో 600 వెంటిలేటర్ పడకలు, టిమ్స్‌లో 136 ఉన్నాయి. ఇవన్నీ రోగులతో నిండిపోయాయి. ఆరోగ్యం మెరుగై ఇతర వార్డుల్లోకి షిఫ్ట్ చేస్తేనో... లేదా పరిస్థితి విషమించి చనిపోతేనో ఖాళీ అవుతున్నాయి. ఇలా ఖాళీ అయిన వాటిని అప్పటికే ఆక్సిజన్ పడకల్లో సీరియస్‌గా ఉన్న వారికి కేటాయిస్తున్నారు. గాంధీకి రోజూ 200 మంది రోగులు వస్తుంటే వారిలో 70 మంది వెంటిలేటర్ కోసమే వస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 మందికి మాత్రమే వెంటిలేటర్ పడకలు దొరుకుతున్నాయి. మిగిలిన వారు అంబులెన్సుల్లో ఆక్సిజన్‌పై గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. ఆస్పత్రిలో చేరకుండానే కాటికి వెళ్తున్న వారూ ఉన్నారు. టిమ్స్‌లో కూడా వెంటిలేటర్ పడకలు ఖాళీగా లేవు.
పెంచితేనే వైద్యం..
గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ పడకల సంఖ్య పెంచడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గాంధీలో కనీసం కొత్తగా 100- 200, టిమ్స్‌లో మరోవంద ఏర్పాటు చేయాలని అనేకమంది కోరుతున్నారు. కింగ్‌కోఠి, ఛాతి, ఫీవర్ తదితర ఆస్పత్రుల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తే విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
యంత్రాలకు డిమాండ్..
కరోనా వైద్యం పెద్ద వ్యాపారంగా మారడంతో అనేక ప్రైవేటు ఆస్పత్రుల్లో వీటి సంఖ్య పెంచడానికి ప్రయత్నించినా కూడా వెంటిలేటర్ సరఫరా కంపెనీలు యంత్రాలను ఇవ్వలేని పరిస్థితి ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మియాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రి యజమాన్యం ఒక్కో వెంటిలేటర్‌కు రూ.13 లక్షల చొప్పున 15 వెంటిలేటర్లకు నెలన్నర రోజుల కిందట కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం అన్ని యంత్రాలను సరఫరా చేయలేమంటూ సంస్థ చెప్పినట్లు ఆస్పత్రి ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ యంత్రాలకు డిమాండ్ పెరగడంతో తయారీ కంపెనీలు ధరను భారీగా పెంచేశాయి. ప్రైవేటులో వెంటిలేటర్ పడకపై చికిత్స ఇవ్వాలంటే రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: నెల రోజుల్లో 1.73 లక్షల మందికి కరోనా