Clash Between TRS and Congress Leaders in Gabbilalpet: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ శ్రేణుల నుంచి చుక్కెదురైంది. సికింద్రాబాద్లోని గబ్బిలాల్పేట ప్రాంతంలో పాదయాత్ర కొనసాగుతున్న క్రమంలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రి మల్లారెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. జవహర్నగర్ ప్రాంతంలో సమస్యలను పరిష్కరిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జవహర్ నగర్లో జీవో నెంబర్ 58, 59 అమలు, 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి మల్లారెడ్డి హామీలకే పరిమితమయ్యారని వారు దుయ్యబట్టారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం కాస్త తోపులాటకు దారి తీసింది. దీంతో గబ్బిలాల్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలు వారిని చెదరదీయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల విషయంలో పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.
"గత ఎన్నికల్లో జవహర్ నగర్లో జీవో నెంబర్ 58, 59 అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు నెరవేర్చలేదు. 50 పడకల ఆసుపత్రి విషయంలో మంత్రి హామీ ఏం అయ్యింది. ప్రజా సమస్యలు కోసం పాదయాత్రకు వచ్చిన మంత్రి అన్ని సమస్యలు తెలుసుకోవాలి. మొత్తం అన్ని డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు గుర్తించాలి. పాదయాత్ర మొక్కుబడిగా చేస్తే సహించేది లేదు. మా ప్రాంతంలో సమస్యలు పరిష్కారం చూపకపోతే మరింత పెద్ద ఉద్యమం చేపడతాం."- సునీత, కాంగ్రెస్ నాయకురాలు
ఇవీ చదవండి: