సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్ పేట్ చెరువు నాలాపై రూ. రెండు కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బ్రిడ్జికి కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హస్మత్ పేట చెరువు వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు, నాలా పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగినందున చెరువుపై ఉన్న చెక్ డ్యామ్ సామర్థ్యాన్ని పెంచడం, బ్రిడ్జి నిర్మించడం వల్ల వరదలను నివారించవచ్చని ఎమ్మెల్యే మాధవరం తెలిపారు. వరదలు వచ్చిన సమయంలో నాలా పరివాహక ప్రాంతాలు నీట మునుగుతుండటాన్ని దృష్టిలో ఉంచుకొని పేద ప్రజల శ్రేయస్సు కోసం నూతన బ్రిడ్జి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంటు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు.
రాబోయే కాలంలో 40 సెంటీమీటర్ల వర్షం వచ్చినప్పటికీ వరద ప్రవాహం ఇళ్లలోకి రాదని, పక్కా ప్రణాళికలతో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆరు నెలల్లోగా చెక్ డ్యామ్‌పై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. మంత్రి కేటీఆర్ ఇంటి పన్ను విషయంలో 50 శాతం తగ్గించడం కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఇదీ చదవండి: గ్రేటర్ బరిలో నిలిచేందుకు అభ్యర్థులకు భాజపా ఆహ్వానం