కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీనికోసం ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలివరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వాలంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని.. ఈ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు.
15 జోన్ల తొలగింపు...
ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని.. ఆ విధంగా బల్దియాలో 15 కంటైన్మెంట్ జోన్లను తొలగించినట్లు మంత్రి తెలిపారు. కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్, వైద్య సర్వేలను తగు జాగ్రత్తలతో నిర్వహించాలన్నారు. సోడియం హైఫోక్లోరైట్ ద్రావణం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
ప్రజలెవరూ తొందరపడకండి...
లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మార్చి నుంచి లాక్ డౌన్ విధించినందున వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. వలస కార్మికులకు భోజన సదుపాయాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వృథా అవుతాయన్నారు. అవసరమైతే ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలని సూచించారు.
మందులు కొనుక్కున్న వారి వివరాలు తప్పనిసరి
ఈ సమయంలో సొంత వైద్యం మరింత ప్రమాదమని మంత్రి సూచించారు. అందులో భాగంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీల్లోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలిపారు. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేయాలన్నారు.
మెరుగ్గా పారిశుద్ధ్య పరిస్థితులు
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించడంతో రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్ను ఎదుర్కునేందుకు ఇది దోహదపడుతోందన్నారు. అత్యవసర సేవలను అందించుటకై 104, 108 వాహనాలే కాకుండా ప్రైవేట్ అంబులెన్స్లనూ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించుటకు కేబుల్ టీవీలు, ఆటోల ద్వారా ప్రచారం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిబంధనలను అతిక్రమించిన వాహనాలను స్వాధీనం చేసుకోవాలని వెల్లడించారు.
ఇదీ చదవండిః 'జూమ్' యాప్ ఎందుకు సురక్షితం కాదంటే...!