హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఓడిపోతామని తెలిసే కాంగ్రెస్, భాజపా కలిసి దొంగ రాజకీయాలు చేస్తున్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తెరాసకు సానుకూలంగా పార్టీ అంతర్గత సర్వేలున్నాయన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచారంపై పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. రానున్న వారం రోజులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కారు గుర్తుకు ఓటేస్తే హుజూర్‌నగర్ మరింత అభివృద్ధి చెందుతుందనే మాటకు.. ప్రజల నుంచి మంచి మద్దతు వస్తోందని కేటీఆర్ అన్నారు. తామేం చేస్తామో ప్రజలకు చెప్పేందుకు కాంగ్రెస్ దగ్గర అంశాలేమి లేవని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలతో భాజపా బలమెంతో తేలిపోతుందని పేర్కొన్నారు. ఆ పార్టీకి డిపాజిట్ వస్తే అదే వారికి గొప్ప ఉపశమనమని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండిః హైదరాబాద్ గ్లోబల్ డిజైన్ డెస్టినేషన్ కాబోతోంది: కేటీఆర్