KTR Shocking Comments On Narendra Modi : ఉద్యోగం అడిగితే పకోడీలు వేసుకోమన్న ప్రధాని.. ఇప్పుడు యువత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా సభలో ప్రధాని మోదీ చెప్పితే బాగుండేదన్నారు. హనుమకొండలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రూ.20వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ గుజరాత్‌కు.. రూ.520 కోట్ల రిపేర్ షాపు తెలంగాణకా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల, డిమాండ్ అని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ప్రధాని గుజరాత్‌కు రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీని తన్నుకుపోయి.. ఇప్పుడు కాజీపేటలో రూ.520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాపు పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ధ్వజమెత్తారు.
అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని : దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన విఫల ప్రధాని మోదీనేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్ర పరిధిలోని 16 లక్షల ఖాళీలు భర్తీ చేయలేని ప్రధాని మోదీ.. రాష్ట్రంలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన తమపై నిందలా వేస్తున్నారా అని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో 3వేల ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదని చెప్పిన మోదీ.. మరి ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించకుండా అడ్డుకుంటున్న గవర్నర్‌కు ఒక మాట చెబితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
KTR Comments On Modi : రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని అడ్డుకొని.. అడవి బిడ్డల గురించి మాట్లాడటం ప్రధాని కపట ప్రేమకు నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు. హనుమకొండ సభలో 15 వేల మంది స్థానికులకు ఉద్యోగాలిచ్చే బయ్యారం ఫ్యాక్టరీ గురించి ఒక్క మాట కూడా ప్రధాని మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలతో 700 మంది రైతులను పొట్టనబెట్టుకున్న ప్రధాని.. వ్యవసాయంపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందన్నారు.
తెలంగాణే తమ కుటుంబం.. రాష్ట్ర ప్రజలే తమ కుటుంబ సభ్యులు : సమగ్ర వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమంలో దేశానికి ఆదర్శం, దిక్సూచి తెలంగాణ అని మరోసారి మంత్రి కేటీఆర్ పునర్ఘాటించారు. తెలంగాణే తమ కుటుంబం.. రాష్ట్ర ప్రజలే తమ కుటుంబ సభ్యులన్నారు. రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న తెలంగాణ కుటుంబ పార్టీ తమదేనని వ్యాఖ్యానించారు. కేంద్ర ఏజెన్సీలను బూచీగా చూపి ప్రధాని హెచ్చరికలకు, ఉడత ఊపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. తెలంగాణకు వచ్చి ఇక్కడి ప్రభుత్వంపైన అసత్యాలు చెప్పి ఉత్త చేతులతో వెళ్లడం మోదీకి అలవాటేనని మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు.
ఇవీ చదవండి :