KTR on Rural Development: పల్లె వాతావరణంపై తనకు అవగాహన కొంచెం తక్కువేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పల్లెలపై లోతైన అవగాహన ఉందని.. కొందరు పెద్దలు చెప్పారని అన్నారు. తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదని తెలిపారు. దేశంలో ప్రభుత్వ వ్యవస్థ ఐదు అంచెలుగా ఉందని వివరించారు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి జరగదని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేశంలోనే అగ్రస్థానంలో: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలో జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్ పాల్గొన్నారు. తొమ్మిది కేటగిరీల్లో 50 అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీలు గ్రామాలకు, మండలానికి మధ్య సమన్వయకర్తగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం .. దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వివరించారు. గ్రామాల అభివృద్ధిపై సర్పంచ్‌లకు మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా తాను ఉన్నప్పుడు కంటే.. ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని కేటీఆర్ తెలిపారు. స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్ల పేరిట కొత్త వ్యవస్థను తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకు.. దేశంలోని ఇతర రాష్ట్రాల గ్రామాలకు ఎంతో తేడా ఉందని వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణతో నాయకత్వం గడప వద్దకు వచ్చిందని.. పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
రాష్ట్రానికి అవార్డులు ఇవ్వాల్సి వస్తోంది: ఇందులో భాగంగానే 2015 నుంచి 2022 వరకు.. రాష్ట్రానికి 79 పంచాయతీరాజ్ జాతీయ అవార్డులు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో సమీకృత, సమ్మిళిత అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. మోదీకి ఇష్టం లేకపోయినా రాష్ట్రానికి అవార్డులు ఇవ్వాల్సి వస్తోందని వివరించారు. రైతుబంధు ద్వారా రూ.65,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.. తెలంగాణలో జరుగుతున్న పనులు.. మీరు పాలించే ఏ ఇతర రాష్ట్రంలోనైనా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. సర్పంచ్‌లు చేసిన పనులకు సంబంధించి.. రూ.1300 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. శత్రుదేశంపై పగ పట్టినట్లు కేంద్రం తెలంగాణపై ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. ఏదో రకంగా రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసేందుకు చూస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో అగ్రస్థానం.. అవినీతిలో అట్టడుగు స్థానం ఉందని వివిధ సర్వేలు చెబుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
"పల్లె వాతావరణంపై నాకు అవగాహన కొంచెం తక్కువే. తొలిసారి గెలిచిన ప్రజాప్రతినిధులకు తమ విధులపై పూర్తి అవగాహన ఉండట్లేదు. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయకపోతే అభివృద్ధి జరగదు. ఎంపీటీసీలు గ్రామాలకు, మండలానికి మధ్య సమన్వయకర్తగా ఉండాలి. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. గ్రామాల అభివృద్ధిపై సర్పంచ్‌లకు మరిన్ని శిక్షణా శిబిరాలు నిర్వహించాలి." -కేటీఆర్, మంత్రి
ఇవీ చదవండి: కేంద్రం సాయం లేకున్నా.. అభివృద్ధిలో దూసుకెళ్తున్నాం : కేటీఆర్
మోదీ డిగ్రీ సర్టిఫికెట్ అడిగినందుకు.. కేజ్రీవాల్‌కు రూ.25వేలు ఫైన్