కరోనా కష్టకాలంలో చుట్టుపక్కల అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని తెరాస శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ చేయాలన్నారు. ఇరవై సంవత్సరాల పాటు ప్రజల్లో మమేకమైన అనుభవంతో మరోసారి ప్రజల సేవకు పునరంకితమవుతామని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశ రాజకీయాలపైన తెరాస ప్రత్యక్షంగా ప్రభావం చూపించలేకపోయినప్పటికీ తన పథకాలు, కార్యక్రమాల ద్వారా పరోక్షంగా ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు.
తెరాస ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు కేంద్రం, వివిధ రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్న విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. దేశంలో రెండు దశాబ్దాలపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీగా తెరాస ఉండడం సంతోషకరమన్నారు. గులాబీ పార్టీ 20వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజలతోపాటు పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చిన ఆచార్య జయశంకర్, విద్యాసాగర్‌రావులాంటి ఎందరో మహానుభావులను గుర్తించుకుంటామన్నారు. 60లక్షలమంది కార్యకర్తలతో తెరాస అజేయశక్తిగా నిలిచిందని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును మూడు సంవత్సరాలలో పూర్తి చేసిన ఘనత తెరాసకే దక్కుతుందన్నారు. తెలంగాణలో హరితవిప్లవంతో పాటు క్షీర, పింక్ (మాంసం), నీలి (చేపలు), శ్వేత (పాలు), జల విప్లవాలు తెలంగాణలో ఆవిష్కృతమయ్యాయని కేటీఆర్ వివరించారు.
కరోనా కష్ట కాలంలో ముఖ్యమంత్రి మార్గదర్శనం చూసిన తర్వాత ఆయన నాయకత్వం మరో పది, పదిహేను సంవత్సరాలపాటు కొనసాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని... అందులో తానొకడినని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందన్నారు. ఇది ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలకి ఆయన మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొన్నారు.
తెలంగాణ విభజన సందర్భంగా ద్వేషించిన లక్షలాది మంది ఈరోజు కేసీఆర్ను అత్యధికంగా అభిమానిస్తున్నారన్నారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ తెరాస పార్టీ కార్యాలయాలు సిద్ధమయ్యాయని చెప్పారు. ప్రస్తుత సంక్షోభం ముగిసిన తర్వాత వాటి ప్రారంభోత్సవాలతోపాటు కార్యకర్తల శిక్షణ కార్యక్రమాల పైన ఆలోచన చేస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు.