టెక్నాలజీ రంగంలో 2020 తెలంగాణకు అత్యంత ప్రాధాన్యమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అంకుర సంస్థలు ఈ దిశగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. టీ హబ్ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ఏడాది టీ హబ్ రెండో దశను, దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైపింగ్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఇన్నోవేషన్ రంగంలో టీ- హబ్
నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీ హబ్ నిర్వాహకులు, స్టార్టప్ ప్రతినిధులు, ఐటీ ప్రొఫెషనల్స్‌తో కేటీఆర్ సమావేశమయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టీ- హబ్ తెలంగాణకు ప్రత్యేక స్థానాన్ని సాధించి పెట్టిందన్నారు. గత నాలుగేళ్లలో టీ-హబ్ సాధించిన ప్రగతి పట్ల కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే ఇన్నోవేషన్, స్టార్టప్ రంగంలో
ఇప్పటికే 2020ను కృత్రిమ మేధ సంవత్సరంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించగా.. ఏడాది పొడుగునా వినూత్నమైన కార్యక్రమాలను టీ హబ్ చేపట్టనుంది. ఏఐతో పాటు ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలోనూ ముందువరుసలో నిలిచేందుకు రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోంది. యువతను ప్రోత్సహించేందుకు టీ-హబ్ రెండో దశను, టీ వర్క్స్ ను ఈ సంవత్సరం మధ్యలో పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు.
ఇదీ చదవండిః బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని