KTR on Amara Raja Group Investments: రాష్ట్రంలో 9వేల 500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు.. ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా గ్రూప్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, అమరరాజా సంస్థ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఈవీ బ్యాటరీలు తయారు చేసే... లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ దివిటిపల్లిలో విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రదేశమన్న అమరరాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్... కొత్త సాంకేతికతతో బ్యాటరీల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే పెట్టబడులు పెట్టాలని కేటీఆర్ తనను సంప్రదించారన్న గల్లా జయదేవ్... సరైన సమయం కోసం చూశామని తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా.. ఈవీ రంగంలో పెట్టుబడి కోసం తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకున్నట్లు వెల్లడించారు.
'చాలాకాలం పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని వ్యాపారాలు, అనుకూల విధానాలు విశ్లేషించిన తర్వాత తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ... 2021లోఅమరరాజా ప్రకటించిన ఎలక్ట్రిక్ పాలసీకి సారూప్యంగా ఉన్నట్లు గుర్తించాం. ఈ తరహా దృఢమైన ఎలక్ట్రిక్ పాలసీని రూపొందించిన మంత్రికి కృతజ్ఞతలు. అమరరాజా చరిత్రలో తొలిసారిగా కంపెనీ స్వస్థలమైన చిత్తూరుకు వెలుపల కొత్త కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వచ్చే పదేళ్లలో రూ.9,500కోట్లతో పెట్టుబడితో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల అమరరాజ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని ప్రజలు వలసలు వెళ్లకుండా స్థానికులకు ఉపాధి కల్పించాలనే నినాదాన్ని 30ఏళ్లుగా చిత్తురూలో అమలుచేశాం. ఇప్పుడు దీనిని తెలంగాణలోనూ అమలుచేయనున్నాం. ఈ పెట్టుబడి అమరరాజ ప్రగతి ప్రయాణాన్ని మరో దశకు తీసుకువెళ్తుందనే విశ్వాసం ఉంది. ఈవీ రంగంలో తెలంగాణను అగ్రగ్రామిగా మార్చేందుకూ సహకరిస్తుందని భావిస్తున్నాను.'-గల్లా జయదేవ్, అమరరాజా సంస్థ ఛైర్మన్
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన... అమరరాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు. మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయని, అమరరాజా కంపెనీకి అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ పెట్టుబడి... ఎలక్ట్రిక్ రంగంలో దేశంలో తెలంగాణ అగ్రగ్రామిగా ఎదిగేందుకు కీలక ముందడుగని కేటీఆర్ పేర్కొన్నారు.
'రూ.9,500కోట్లు అనేది భారీ పెట్టుబడి. సమృద్ధమైన వాహనరంగానికి దేశంలో కీలక కేంద్రంగా మారాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల్లో కీలక ముందడుగని చెప్పుకోవాలి. ఇది అమరరాజ గ్రూప్‌నకు చెందిన భారీ పెట్టుబడే కాదు అడ్వాన్స్ సెల్ కెమిస్ట్రీలో భారత్‌లోనే అతి పెద్దది. అందుకే అతిపెద్ద ముందడుగు. ప్రత్యేకంగా ఉత్పత్తి రంగంలో అతిపెద్ద పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యమున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఎదిగాం. తెలంగాణలో సమగ్రమైన ఈవీ, అడ్వాన్స్‌డ్ సెల్ కెమిస్ట్రీ ఎకో సిస్టం అభివృద్ధిలో ఈ అమరరాజా ప్రాజెక్టు ప్రేరణగా అనుసంధాన కర్తగా మారుతుందని విశ్వసిస్తున్నాం. అతిపెద్ద ఉత్పత్తిరంగ నిర్మాణంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనకు దోహదపడుతుంది.'-కేటీఆర్, పరిశ్రమల శాఖ మంత్రి
ఈ పెట్టుబడి వల్ల రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలంగాణ సర్కార్ అంచనావేస్తోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అమరరాజా సంస్థ ఛైర్మన్, ఎండీ గల్లా జయదేవ్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీఫైబర్ ఎండీ, సీఈఓ సుజయ్, ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: